పవన్ కల్యాణ్ – తమిళ దర్శకుడు నేసన్ కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. తమిళ చిత్రం వేదాళంని పవన్ తో రీమేక్ చేద్దామనుకొన్నారు. అయితే కాటమరాయుడు ఫ్లాప్ అవ్వడంతో పవన్ కి హిట్టు కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో తన మిత్రుడు త్రివిక్రమ్ సినిమాని మొదలెట్టేశాడు. నేసన్ వెయిటింగ్ లిస్టులో ఉండిపోయాడు. ఈలోగా పవన్ కోసం కొత్త కథలు రెడీ అవ్వడం మొదలెట్టాయి. కొరటాల శివ – పవన్ కాంబో దాదాపుగా ఫిక్స్ అయినట్టే. దాంతో… నేసన్ సినిమా పక్కకి వెళ్లిపోయిందనుకొన్నారంతా. పవన్ తాను తీసుకొన్న అడ్వాన్సు కూడా తిరిగి ఇచ్చేశాడని, వేదాళం రిమేక్ ఇక లేనట్టే అనంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. వీటిపై చిత్రబృందం ఓ వివరణ ఇచ్చింది. ”పవన్ తో – నేసన్ సినిమా ఉంటుంది. అయితే దానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది. పవన్ శైలికి తగ్గట్టు వేదాళంలో మార్పులు చేస్తున్నాం. అందుకే.. సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతోంది” అంటూ చిత్రబృందం తేల్చి చెప్పింది. పవన్ అడ్వాన్సు తిరిగి ఇచ్చేశాడన్న వార్తల్లో కూడా నిజం లేదట. అయితే.. ”నేసన్ సినిమా చేయడానికి నాక్కొంచెం టైమ్ కావాలి” అని పవన్ అడిగినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరవాత.. పవన్ సినిమా ఎవరితో అన్నది ఇంకా నిర్థారణ అవ్వలేదు. పవన్ మూడ్ బాగుంటే.. నేసన్ తో సెటిల్ అయిపోవొచ్చని, ఏఎం రత్నం అందుకోసమే తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడని, రెండ్రోజుల క్రితమే పవన్‌ని కలిసి, సినిమా గురించి చర్చించాడని తెలుస్తోంది. సో… పవన్ కోసం నేసన్ ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.