జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీగానే ఉన్నారు. ఆయన తాను బీజేపీని వదిలేస్తానని ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఓట్లు చీలిపోకుండా… ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీని ఒప్పిస్తానని అంటున్నారు. అమరావతి విషయంలో అంగీకరింపచేసినట్లే.. ఓట్లు చీలకుండా బీజేపీతో మాట్లాడతానని ఆయన అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ లాంటి వారు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరో వైపు జనసేన పార్టీ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది .
ఓట్లు చీలనివ్వమని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ వ్యాఖ్యలు… ఓట్లు చీలేందుకు ఓ చాయిస్ కల్పిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీని వదిలేస్తారన్న ప్రచారం ప్రారంభమైంది. జనసేన క్యాడర్‌లోనూ బీజేపీతో పొత్తుపై పెద్దగా పాజిటివ్ లేదు.బీజేపీ వల్ల తమకు ఒక్క ఓటు అదనంగా రాకపోగా.. ఉన్న మైనార్టీ ఓట్లు పోతున్నాయని అదే సమయంలో బీజేపీ తమ ఓటు బ్యాంక్‌ను బాగానే కవర్ చేసుకుని.. బలపడుతున్నామన్న భావన కల్పించుకుంటోందని అంటున్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్‌లను ఏపీలోనూ ఉపయోగించుకోవాలంటే ఆ పార్టీతో పొత్తు ఉండాలని పవన్ కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి వైసీపీ అధికారం నిలబెట్టుకునేందుకు అధికారాన్ని అడ్డంగా వాడుకుంటుందని దాన్ని అడ్డుకోవడానికి మరో అధికార కేంద్రం కావాలని జనసేనాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో ముందస్తు ఎన్నికల చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా పొత్తుల ప్రస్తావనే వస్తోంది. అందులోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే ఆయన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతున్నాయి.