ట్విస్ట్ ల మీద ట్విస్ట్‌లతో తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తెలుగు రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. “తూచ్… నేను కాంగ్రెస్‌లో జేరడం అంతా అబద్ధం. అదంతా మీడియా ప్రచారమే, నేను చంద్రబాబు చెప్పిన మాట వినే మంచి బాలుడిని” అంటూ ఇలా రేవంత్ ప్లేటు ఫిరాయించాడో లేదో అలా…తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ఎదురుదాడి మొదలైంది. దీనిలో పాల్గొన్నవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పయ్యావుల కేశవ్‌నే. ఆంధ్రా రాజకీయాల్లో సీనియర్ టిడిపీ నేత అయిన పయ్యావుల… ఇప్పటివరకూ రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించకపోవడమే విచిత్రమైతే… రేవంత్ పార్టీ మారడంపై యూ టర్న్ తీసుకున్నాక… స్పందించడం మరింత విచిత్రం…
ఇక సోమవారం పయ్యావుల రేవంత్‌పై చేసిన విమర్శల్లో చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. రేవంత్ ఆరోపించినట్టుగా తనకు తెలంగాణలో ఎటువంటి వ్యాపారాలు లేవని, కనీసం ఒక ఫ్లాట్ కూడా లేదని పయ్యావుల స్పష్టం చేశాడు. నిజానికి కెసియార్ కుమార్తె కవితతో కలిసి ఒకప్పుడు వ్యాపారం చేసిన రేవంత్ ఆ తర్వాత సన్నిహితుల ఒత్తిడితో బయటకు వచ్చిన విషయం నిజం కాదా? అని నిలదీశాడు. ఓ పెళ్లిలో చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని వ్యక్తిగత అజెండాతో రేవంత్ ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టాడు. గత ఆర్నెళ్లుగా రేవంత్ ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేస్తున్నాడో తన దగ్గర పూర్తి వివరాలున్నాయని హెచ్చరించాడు. అవి సమయం చూసుకుని బయటపెడతా అన్నాడు. రేవంత్, చంద్రబాబును కలిసిన తర్వాతే రేవంత్‌కు తాను బదులిద్దామ ని అనుకున్నా కానీ, ఆలస్యమైన కొద్దీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని స్పందిస్తున్నా అన్నాడు.
తెలుగుదేశం పార్టీలో తనకన్నా రేవంత్‌నే చంద్రబాబు ఎక్కువ ప్రోత్సహించారని అన్నాడు. ప్రాణస్నేహితులకు సైతం హాని తలపెట్టడానికి తెగిస్తాడనే రేవంత్ మనస్తత్వం దీనితో వెల్లడైందని, తన నైజం బయటపెట్టుకుని రేవంత్ తనకు తానే నష్టం చేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. వైసీపి అధినేత వైఎస్ జగన్‌తో రేవంత్ గత కొంతకాలంగా అంటకాగుతున్నాడని, అందుకే జగన్‌కు చెందిన మీడియా రేవంత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించాడు. ఇప్పటికే 3 పార్టీలు మారిన రేవంత్ ఇంకో పార్టీ మారితే ఆశ్చర్యపోవాల్సింది లేదన్నాడు. తమకు మాత్రం అప్పుడూ ఇప్పుడూ తెలుగుదేశం పార్టీయే గమ్యం అన్నాడు. తమకు , యనమలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదన్నాడు. మీడియాతో చిట్ చాట్ పేరుతో పయ్యావుల కేశవ్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయిన. మరోవైపు ఎపి డిప్యూటీ సిఎం చిన రాజప్ప కూడా రేవంత్ టీడీపీ నేతలపై వ్యాఖ్యలు సరైనవి కావని ఖండించాడు. ఏదైనా ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలే తప్ప ఇలా పార్టీ నేతలపై ఆరోపణలు సరికాదన్నాడు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఓ అడుగు వెనక్కు వేయగానే తెదేపా నేతలు ఒక్కొక్కరుగా ముందడుగు వేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది.