తప్పించుకోలేని విధంగా తన చట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్లారిటీ వచ్చేసింది. ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనపై పెద్ద స్కెచ్ వేశారని.. తాను ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల్ని భయపెట్టి వారిపై కేసులు పెట్టి తన పేరు చెప్పించేలా ప్లాన్ చేశారని ఆయన అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు నిప్పు పెట్టిన వ్యవహారం దగ్గర నుంచి పెద్దిరెడ్డి గురించి లెక్కలేనన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. భూపరిమితికి మించి ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా భూములు ఉన్నాయి. ఇక కంపెనీల పేరుతో వేల ఎకరాలు కొట్టేశారని అనేక మంది వచ్చి ఫిర్యాదులు చేశారు. ఇప్పటికీ భయంతో చాలా మంది తెర ముందుకు రావడం లేదు కానీ… పెద్దిరెడ్డి ముఠా దండుపాళ్యం గ్యాంగ్ లా మారి.. ప్రజల్ని పీడించుకుని వారి ఆస్తుల్ని కాజేశారని.. వెల్లువలా వచ్చిన ఫిర్యాదులే చెబుతున్నాయి.
Also Read : పెద్దిరెడ్డి.. దేన్నీ వదల్లేదుగా..!
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల కాల్చివేతగా మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. సీఐడీకి అప్పగించినట్లుగా ఉత్తర్వులు రాగానే పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి కుట్ర సిద్దాంతాలు చెబుతున్నారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన చేసిన కుట్రలు.. చిన్న చిన్నవి కావు. అంగళ్లులో, పుంగనూరు శివార్లలో చంద్రబాబుపై హత్యాయత్నాలే జరిగాయి. కుప్పంలో.. హిందూపురంలో ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి సింపుల్గా దొరికిపోయారని.. ఆయనపై చట్టపరంగా వెళ్తే చాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి కూడా చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారని తాను దొరికిపోయానని అనుకుంటున్నారు.