పవన్ కల్యాణ్ ఎక్కడా పరిధి దాటకుండా రాజకీయ విమర్శలు చేస్తూంటే .. వైసీపీ నేతలు మాత్రం ఆయనను అత్యంత దారుణంగా తిట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కత్తిపూడి బహిరంగసభలో పవన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని.. .. మధ్యలో పవన్ కల్యాణ్‌కు తన రెండు చెప్పులు తీసి చూపించారు. పవన్ ఓ సారి తనను బూతులు తిడితే చెప్పుతో కొడతానని పార్టీ ఆఫీసులో చెప్పు తీసి చూపించారు. దాన్ని గుర్తు చేస్తూ.. పవన్ ఒక చెప్పు తీస్తే తాను రెండు చెప్పులు తీస్తానని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వేషాలేస్తే మక్కెలిరగదీస్తామని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ సినిమాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శలు చేస్తున్నారని, ఏ సినిమాను ఆపామో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సినిమాలు బాగా తీయక పోతే ఎందుకు ఆడతాయని ప్రశ్నించారు. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్లు వస్తాయని, వ్యూహాలను నమ్ముకుంటే శాసనసభకు కూడా రాలేరని అన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఆరోపించారు . రోజుకో డైలాగ్ చెప్పి అదో వ్యూహంగా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్స్, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. గులాబీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నదెవరో అందరికీ తెలుసన్నారు. సినిమా రిలీజ్ టైంలో కేసీఆర్ కాళ్లు మొక్కుతారని ఆరోపించారు. హరీష్‌రావు ఏపీని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల చొక్కా పట్టుకుంటానంటున్న పవన్ ఎన్నిసార్లు చంద్రబాబు, మోడీ చొక్కా పట్టుకున్నారాని ప్రశ్నించారు.
విధానాల పరంగా .. పవన్ ను ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి..చెప్పులు చూపించి.. మక్కెలిరిగదీస్తామని మాట్లాడి.. ఎవరి మెప్పు కోసం పేర్ని ప్రయత్నిస్తున్నారో కానీ.. ఒకే వర్గంలో.. చిచ్చు పెట్టడానికి పేర్ని ని ఓ టూల్ గా వాడుకుంటున్నారన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.