శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కలక్షన్లు ఓ వైపు దంచి కొడుతోంటే, మరోవైపు విమర్శల జడివాన కూడా అంతే ధాటిగా కురుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి కోర్టు గొడవలూ మొదలయ్యాయి. ఆదిపురుష్ లో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఈ సినిమాలో హిందూవుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయని హిందూసేన జాతీయ అధ్యక్షుడు గుప్త ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు, వాల్మీకీ, తెలసీదాస్ రచించిన రామాయణంలోని పాత్రలకు విరుద్ధంగా ప్రధాన పాత్రల్ని అనుచిత రీతిలో తెరకెక్కించారని, దేవతా మూర్తుల వర్ణన సరిగా లేదని, బ్రహ్మణుడైన రావణుడ్ని గడ్డంతో చూపించడం అభ్యంతరకరంగా ఉందని, రావణుడికి సంబంధించిన సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, ఆయా సన్నివేశాల్ని సరిదిద్దాలని, లేదంటే పూర్తిగా తొలగించాలని, అప్పటి వరకూ ఆదిపురుష్ ప్రదర్శనల్ని నిలిపివేయాలని పిటీషన్లో కోరారు. ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ చేపట్టి, తీర్పు వెలువరించాల్సివుంది.