వివేకా హత్య కేసును కూడా అక్రమాస్తుల కేసులాగా పిటిషన్లతో పెండింగ్ పెట్టించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే దాఖలైన పిటిషన్లకు తోడు వివేకా పీఏగా ఉన్న కృష్ణారెడ్డి కూడా ఓ పిటిషన్ వేశారు. ఆయన కూడా అవినాష్ రెడ్డి చేసినట్లే… ఆస్తుల కోసం హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ వేశారు. ఇలా అనుకూలంగా ఉన్న వారందరితో ఒకే ఆరోపణ చేయిస్తూ వరుసగా పిటిషన్లు వేయిస్తూండటం చర్చనీయాంశంగా మారింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇదే వ్యూహం పాటిస్తున్నారు. వందల పిటిషన్లు దాఖలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. క్వాష్ పిటిషన్లు.. కింది కోర్టు.. పైకోర్టు.. సుప్రీంకోర్టు అంటూ టైం పాస్ చేస్తున్నారు. ఇంత వరకూ కేసుల్లో ట్రయల్ ప్రారంభం కాలేదు. దాదాపుగా పన్నెండేళ్ల నుంచి ప్రధాన నిందితుడు, తర్వాత నిందితుడు బెయిల్ పై ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అయ్యారు. అంతకు మించి అరాచకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వివేకా కేసును కూడా అలాగే చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
వివేకా కేసులో అక్రమాస్తుల కేసులో ఉన్నంత మంది అనుమానితులు.. నిందితులు..సాక్షులు లేరు. పైగా ఆ కేసు వేరు.. ఈ కేసు వేరు. ఇది అత్యంత క్రూరమైన హత్యకేసు. ఇలా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై రివర్స్ కేసులు వేస్తే … న్యాయవ్యవస్థ కేసును డీలే చేస్తుందని అనుకోవడం అమాయకత్వం అన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ హత్య కేసును సీబీఐ కూడా కొలిక్కి తేకుండా వ్యవస్థల ద్వారా ఆలస్యం చేయిస్తే … అది నిందితుల విజయమే అవుతుంది.