వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులు ఎందుకు తేలడం లేదు ? . వాస్తవానికి ఆ కేసులకు సంబంధించి విచారణలు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. కానీ అసలు విచారణ వద్దకు రావడంలేదు. దీనికికారణం… నిందితులు ఒకరి తర్వాత ఒకరు క్వాష్ పిటిషన్లని.. మరొకటని దాఖలు చేస్తూ పోవడమే. కారణాలు లేకపోయినా అనేక రకాల పిటిషన్లు వేసి విచారణను ఆలస్యం చేస్తున్నారని సీబీఐ అధికారులు చాలా సార్లు కోర్టు దృష్టికి కూడాతీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుటికి అలాంటి క్వాష్ పిటిషన్లపై విచారణ జరుగుతూనే ఉంది. అసలు కేసుల విచారణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది.
ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనూ విచారణ అలాగే ఆలస్యం అయ్యే వ్యూహం పన్నినట్లుగా కనపిస్తోంది. ఏపీ హైకోర్టులో ఒకే రోజు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్. ఆయన దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలకమైన నిందితునిగా ఉన్నారు. ఆయనను గతంలోనే అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు తనకు కేసుతో సంబంధం లేదని తనను తప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించవద్దంటూ మరో పిటిషన్ దాఖలయింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. అప్రూవర్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. ఈ లోపే రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. అంగీకరించవద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఇలాంటి పిటిషన్లతో వీలైనంత కాలం విచారణ ఆలస్యం చేసే వ్యూహం దారి ఉందని.. అది అచ్చంగా అక్రమాస్తుల కేసు తరహాలోనేనన్న అనుమానాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.