” చేస్తే గీస్తే ఒకరిద్దరి లుచ్చాగాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు ” మార్చి 27వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయన మాటల ప్రకారం .. ఇప్పుడు వారు ట్యాపింగ్ చేసిన వారి వివరాలు చూస్తే కేటీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ప్రత్యర్థుల్ని మాత్రమే కాదు తమతో ఉన్న వారిని కూడా లుచ్చాగాళ్లలాగా చూశారని అర్థమైపోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చూసిన ఎవరికైనా … కేసీఆర్ తమకు అనుమానం వచ్చిన … తమకు వ్యతిరేకించిన వారిని ఎవర్నీ వదలకుండా ట్యాపింగ్ ద్వారా ట్రాప్ చేశారని స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాపింగ్ – ఇదేం వ్యక్తిత్వం !
రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఇప్పటి వరకూ తెలంగాణలో ట్యాపింగ్ కేసు ఫాలో అయిన వారు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకారం చూస్తే.. సొంత పార్టీ నేతల్ని వదల్లేదు. నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విబేధాలున్న నేతల్నీ వదల్లేదు. శంభీపూర్ రాజు అనే ఎమ్మెల్సీ కేసీఆర్ అంటే ప్రాణం ఇస్తారు. ఉద్యమం నుంచి ఆయన వెంటే ఉన్నారు.. కానీ ఆయన ఫోన్ ను కూడా ట్యాప్ చేశామని రాధాకిషన్ రావు తేల్చారు. అలాంటి శంభీపూర్ రాజు నుంచి నేడు కేసీఆర్ పార్టీలో చేరిన మాజీ బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ వరకూ బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశారు. వ్యక్తిగత రహస్యాలు తెలుసుకున్నారు.
వీళ్లంతా కేటీఆర్ చెప్పిన జాబితాలోకి వస్తారా ?
రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టు చూసిన తర్వాత ఎవరికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాజకీయాలు ఒళ్ల గగుర్పొడుస్తాయి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా చేయడాన్ని కేటీఆర్ సమర్థించుకున్నారు. తాను ట్యాప్ చేసిన వాళ్లు లుచ్చాగాళ్ల జాబితాలోకి వస్తారన్నట్లుగా అహంకారంతో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో బయటకు వచ్చిన తర్వాత … ఆయా వ్యక్తులపై కేటీఆర్కు ఉన్న అభిప్రాయం ఏమిటో స్పష్టతకు వస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
గరిష్ఠ స్థాయిలో అధికార దుర్వినియోగం !
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అనేది అత్యంత తీవ్రమైన విషయం. సాక్ష్యాలు దొరకకుండా చేసేస్తామని.. లేకపోతే దొరికే అవకాశం లేదని ఇలా చేయడం గరిష్ఠ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే. కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఇదే జరిగిందని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ద్వారా ప్రజల ముందుకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ ఎన్ని రాజకీయ లక్ష్యాలు సాధించారో కళ్ల ముందే ఉంది.. ఆ లక్ష్యాలు ఆయనను రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లకపోగా ఇప్పుడు పాతాళంలోకి నెట్టేశాయి. ఇప్పుడు ఆయనను నమ్మడానికి సొంత వారు కూడా సిద్ధపడరేమో ?