పిన్నెల్లిపై ఎన్ని కేసులు నమోదైతే అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ వచ్చింది. బెయిల్ షరతులు నెరవేర్చడానికి ఆయన అర్థరాత్రి ఎస్పీ ఆఫీస్కు వెళ్తే .. రండి రండి దయచేయండి అనే రీతిలో అధికారులు స్వాగతం చెబుతారు. ఆయన చేసిన నేరాలు చిన్నవా ?. మూడు హత్యయత్నం కేసులు.. అంతకు మించి ఈవీఎం ధ్వంసం లాంటి కేసులు ఉన్నాయి. పోనీ ఆయనైమైనా సచ్ఛీలుడా అంటే.. మాచర్లను చంబల్ లోయగా మార్చుకున్న బందిపోటు అని ప్రత్యక్షంగా అందరికీ తెలుసు.
పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే పారిపోయారని కూడా తెలుసు. అయినా సరే వ్యవస్థలు ఆయనకు కోరుకున్న న్యాయాన్ని చేశాయి. కానీ జగన్ పై గులకరాయితో దాడి చేశారంటూ.. చిన్న ఆధారం లేకుండా ఆరోపణలతోనే అరెస్టు చేసిన సతీష్ కుమార్ అనే యువకుడి బెయిల్ ను ఇచ్చినట్లే ఇచ్చి ఆపేసింది కోర్టు. తాము బెయిల్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని ఏపీ ప్రభుత్వ లాయర్ అడిగితే తీర్పు అబయన్స్ లో పెట్టారు. దీంతో సతీష్ కుమార్ బెయిల్ ఆగిపోయింది. ఆయన బయటకు రాలేదు.
మరి ప్రభుత్వ లాయర్ లంచ్ మోషన్ వేశారా లేదో ఎవరికీ తెలియదు. వేస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆ కారణం చెప్పి బెయిల్ ఆపేయించారు. జగన్ పై గులకరాయిదాడి జరిగిందనడానికి.. అది సతీషే చేశారనడానికి.. ఆధారాల్లేవు. చివరికి ఆ గులకరాయిని కూడా స్వాధీనం చేసుకోలేదు. అయినా జైల్లో మగ్గిపోతున్నాడు. ఆయనతో పోలిస్తే.. మాచర్ల ఎమ్మెల్యే చేసినదానికి అన్ని ఆధారాలున్నాయి. కానీ ఆయన మాత్రం స్వేచ్చగా అరెస్టు నుంచి రక్షణ పొంది హాయిగా ఉన్నారు. ఇలాంటివి చూసినప్పుడు సామాన్యుడికి ఎలా ఉంటుంది ?