ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌజ్ లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
బుధవారం సాయంత్రంలోగా పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో సీరియస్ గా తీసుకున్న ఈసీ పోలీసులను అలర్ట్ చేసింది. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ పిన్నెల్లి ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులో పిన్నెల్లి డ్రైవర్ పోలీసుల నుండి తప్పించుకున్నారని సమాచారంతో పోలీసులు ఆ మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
అయితే, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని గెస్ట్ హౌజ్ లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్ ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.