సినిమాకి ఓటీటీ నుంచి ముప్పు ముదిరిపోయింది. అదే సమయంలో పైరసీ సైట్ల ప్రమాదం కూడా ఏమాత్రం తగ్గలేదు. కొత్త సినిమాలు విడుదలైన మొదటి రోజే హెచ్ డీ ప్రింట్లు పైరసీ సైట్లలో ప్రత్యక్షమైపోతున్నాయి. పెద్ద సినిమాల కంటే, చిన్న సినిమాలకే వీటి నుంచి ముప్పు ఎక్కువ. తాజాగా పైరసీ సైట్ల సెగ.. దిల్ రాజు సినిమాకి కాస్త గట్టిగానే తాకింది. తమిళ `లవ్ టుడే`ని దిల్ రాజు తెలుగులో డబ్ చేసిన వదిలిన సంగతి తెలిసిందే. ఈ వారం విడుదలైన సినిమాల్లో `లవ్ టుడే`కి టాక్ తో పాటు వసూళ్లూ బాగున్నాయి. తొలి వారాంతంలో `లవ్ టుడే`కి మంచి వసూళ్లే లభించాయి. కానీ.. సోమవారం ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. దానికి కారణం.. పైరసీ సైట్లే.
మూవీ రూల్జ్లో… `లవ్ టుడే` తమిళ వెర్షన్ హెచ్ డీ ప్రింటు ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగు ప్రింటూ దించేశారు. కొన్ని పైరసీ వెబ్ సైట్లలో… `లవ్ టుడే` హెచ్ డీ ప్రింటు ఉంది. అసలే.. లవ్ టుడే యూత్ ఫుల్ సినిమా.యువతరం.. పైరసీ సైట్లకు బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి.. ఈజీగా డౌన్ లౌడ్ చేసుకొని చూసేస్తున్నారు. `లవ్ టుడే` తప్పకుండా మంచి హిట్ అవుతుందని దిల్ రాజు గట్టిగా నమ్మాడు. అందుకే ఆఘమేఘాలపై ఆ సినిమా డబ్ చేసి రిలీజ్ చేశారు. దిల్ రాజు అంచనా నిజమైంది. కాకపోతే.. ఈ సినిమా తెలుగులో కనీసం రూ.20 కోట్లయినా తెచ్చుకొంటుందన్నది ఆయన అంచనా. పైరసీ సైట్ల వల్ల… ఆ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు అందుకోలేదు. పైగా.. ఈ సినిమా కోసం దిల్ రాజు చేసిన ప్రచారం కూడా ఏమీ లేదు. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఓ ప్రెస్ మీట్ తో సరిపెట్టారు. అది కూడా ఊహించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడానికి ఓ ప్రధాన కారణంగా నిలిచింది.