పిఠాపురం వైసీపీ జనసేన పార్టీలో విలీనానికి సన్నాహాలు పూర్తయ్యాయి. రెండు రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు నేతృత్వంలో వైసీపీ క్యాడర్ అంతా జనసేన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ పదవుల్లో ఉన్న వారు కూడా అదే బాటలో ఉన్నారు. అందరూ కలిసి మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన కండువాలు కప్పుకోనున్నారు.
వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత ఎన్నికల తర్వాత అడ్రస్ లేరు. దొరబాబు రాజీనామా చేశారు. పిఠాపురంలో వైసీపీ నేతలను ప్రజలు అసహ్యంగా చూసే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తే గెలవడం కాదు కదా.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అంచనాకు వచ్చారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావడంతో ఆయన అభిమానం సంపాదించుకుంటే.. రాజకీయంగా బయటపడవచ్చని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు.
Also Read :
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కింది స్థాయి వరకూ క్యాడర్ లేదు. పార్టీ నిర్మాణం లేదు. జనసేన పార్టీ తరపున మొత్తం టీడీపీ ఇంచార్జ్ వర్మ ఎలక్షనీరింగ్ నిర్వహించారు. అయితే జనసేన పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనతో వైసీపీ క్యాడర్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు.