ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పీకే వర్సెస్ పీకే అన్నట్లుగా మారిపోయాయి. ఎందుకంటే వైసీపీకి ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రిషిరాజ్ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. టీడీపీకి రాబిన్ శర్మను నియమించుకున్నారు. పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు రాబిన్ శర్మతో మాట్లాడించారు కూడా. ప్రజలకు కష్టాలు తెలియకుండా మీకు ఇన్ని లక్షలు ఇస్తున్నామని చెప్పేందుకు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలను పంపే కార్యక్రమానికి రిషిరాజ్ రూపకల్పన చేశారు. దానికి గడప గడపకూ మన ప్రభుత్వం అని పేరు పెట్టారు. దీనికి కౌంటర్‌గా రాబిన్ శర్మ కొత్తగా మనకు ఇదేం ఖర్మ అనే ప్రోగ్రాంను టీడీపీకి అసైన్ చేశారు.
ఇదేం ఖర్మ అంటూ.. టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి… జగన్ రాక ముందు ఏలా ఉందో.. జగన్ వచ్చిన తర్వాత ఎంత ఖర్మ పట్టిందో వివరించనున్నారు. ప్రభుత్వం సృష్టిస్తున్న ఫీల్ గుడ్ వాతావరణం లేదని .. మీ మీద పన్నులు బాదడమే.. మిమ్మల్ని తాకట్టు పెట్టేసి జగన్ లక్షల కోట్లు అప్పు చేసి దుబారా చేయడమో.. లేకపోతే నొక్కేశారని చెప్పడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. అధికార పార్టీ ప్రతినిధులకు నిరసనలు వ్యక్తమవుతాయేమో కానీ.. ప్రతిపక్ష నేతలకు ఆ బాధ ఉండదు. అందుకే వారు డైరక్ట్ గా జనంలోకి వెళ్లిపోగలరు.
రిషి రాజ్, రాబిన్ శర్మ.. ఒకరి వ్యూహాలకు కౌంటర్‌గా మరొకరు.. స్ట్రాటజీలు రెడీ చేస్తున్నారు. వారిని ఆయా రాజకీయ పార్టీలు ఫాలో అయిపోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలో ఉండగా.. ఐ ప్యాక్ తరపున రిషిరాజ్ పని చేస్తున్నారు. రాబిన్ శర్మ మాత్రం సొంత కంపెనీ పెట్టుకుని టీడీపీకి పని చేస్తున్నారు. ఏపీలో ఎవరు గెలిచినా… క్రెడిట్ పీకేకే దక్కే చాన్సులున్నాయి.