టీటీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకి గవర్నర్ పదవి రాలేదన్న సంగతి తెలిసిందే! దాదాపు మూడేళ్లుగా ఈ పదవిపై ఆశలుపెట్టుకుంటూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మోత్కుపల్లికి పదవి వస్తుందనే ఆశలు కల్పించారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా ‘ప్రధాని సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని’ చెప్పారు. కారణాలు ఏవైతేనేం.. మోత్కుపల్లికి పదవి రాలేదు. రాదనే క్లారిటీ ఆయనకీ వచ్చేసింది. దీంతో ఇప్పుడాయన రాజ్యసభ సీటు గురించి మాట్లాడుతున్నారు! తనను రాజ్యసభకు పంపించాలని ముందే అనుకున్నారనీ, కానీ అంతకంటే మంచి స్థాయి ఉన్న పదవిలో కూర్చోబెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉండేదని మోత్కుపల్లి అంటున్నారు. ఒక దళిత నాయకుడిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అనీ, దాని కోసం ఆయన తనవంతు కృషి చేశారని అంటున్నారు. ఈ వ్యాఖ్యల అంతర్యం ఏంటంటే.. ఎలాగూ గవర్నర్ గిరీ పోయింది కాబట్టి, కనీసం రాజ్యసభకు అయినా తనను పంపించాలనే విజ్ఞాపన!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికలు ఉంటాయి. కాబట్టి, తనకు అవకాశం కల్పించాలనేది చంద్రబాబును ఆయన కోరుతున్నారు. అయితే, ఇక్కడ మరో చిక్కు వచ్చిపడింది! ఆంధ్రా కోటాలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లిని రాజ్యసభకు పంపించడం కష్టమే. ఆ మాట చంద్రబాబు స్వయంగా ఇదివరకే చెప్పేశారు కదా! ఏపీ కోటాలో తెలంగాణ నాయకులను రాజ్యసభలో చోటు కల్పించే అవకాశం లేదని స్పష్టం చేసేశారు. అంటే, మోత్కుపల్లి రాజ్యసభ సీటు కలలు కూడా అనుమానంగానే కనిపిస్తున్నాయి. రాజ్యసభ సీటు కూడా దక్కకపోతే మోత్కుపల్లి ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. పోనీ, పార్టీలో ఉంటూ మరోసారి క్రియాశీల రాజకీయాలు చేద్దామంటే.. రేవంత్ రెడ్డి నాయకత్వం అంటే ఆయనకు పడదు!
అయితే, ఈ నేపథ్యంలో తెరాస పొత్తు అనే టాపిక్ ను మోత్కుపల్లి తెరమీదికి తెచ్చారు. నిజానికి, కాంగ్రెస్ తో పొత్తు కోసం టీ టీడీపీ సిద్ధమన్నట్టు సంకేతాలు ఇస్తోంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. అయితే, కాంగ్రెస్ తో పొత్తు ఎలా సాధ్యమౌతుందని మోత్కుపల్లి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందనీ, అలాంటి పార్టీతో పొత్తు ఏంటనేది ఆయన లాజిక్! ఇంతకీ, తెరాసతో పొత్తు ప్రతిపాదన వెనక మోత్కుపల్లి ఆలోచన ఏంటంటే… తెరాస, టీడీపీలు పొత్తు పెట్టుకుంటే అప్పుడు రేవంత్ టీడీపీలో కొనసాగలేని పరిస్థితి వస్తుంది కదా! ఎందుకంటే, కేసీఆర్ కు బద్ధ వ్యతిరేకి రేవంత్. తెరాసతో పొత్తు కుదిరితే ఆయన టీడీపీలో ఉండే పరిస్థితి ఉండదు. తెరాస కూడా రేవంత్ తో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు! కాబట్టి, ఈ కొత్త పొత్తు ప్రతిపాదన వెనక మోత్కుపల్లి వ్యూహం ఇదేనేమో అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా, టీ టీడీపీలో కొన్ని చిక్కులు తప్పేట్టుగా లేవు.