ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని.. వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయబోతున్నారు. నిజానికి ఇది రాజ్యాంగ పరమైన అంశం. రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ ఆయన మాత్రం నేరుగా వర్గీకరణ సభలో పాల్గొని అనుకూల ప్రకటన చేసి.. ముందుగా ఓట్ల లాభం పొందాలనుకంటున్నారు. ప్రధాని పదవిలో ఉన్న ఆయన ఇలా చేయవచ్చా అంటే… మోదీ చేయవచ్చు అనే సమాధానమే వస్తుంది.
రిజర్వేషన్ మాల, మాదిగ కులాల మధ్య ఉన్న వివాదం. ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. మాల, మాదిగలతో పాటు దళిత వర్గాల్లో 57 ఇతర కులాలు ఈ రిజర్వేషన్లు పొందుతున్నాయి. ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే వాదన 1970 దశకంలో మొదలైంది.. రాజకీయ పార్టీలు దీన్ని ఓటు బ్యాంకు రాజకీయంగా మార్చుకున్నాయి. 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. 2004 నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. దీనిపై పార్లమెంట్ లో చట్టం చేయాలని.. మందకృష్ణ పోరాడుతున్నారు. కానీ పట్టించుకోలేదు.
తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల మందకృష్ణను ప్రధాని మోదీ పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలకరించి ఫోటోలు విడుదల చేశారు. ఇప్పుడు మందకృష్ణ నేతృత్వంలోనే మాదిగ విశ్వరూపసభ ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తే మాదిగలంతా మద్దతు పలుకుతారని మోదీ నమ్ముతున్నారు. తానీ మాలలకు అన్యాయం చేసినట్లు కాదా అన్న ప్రశ్న వచ్చినా అలా ఆలోచించడం లేదు. బీజేపీ మాల నేతలు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు.