ఆంధ్రప్రదేశ్ కి తానొక శుభవార్త పట్టుకొచ్చా అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… ఎన్నోయేళ్లుగా ఉత్తరాంధ్రుల స్వప్నమైన విశాఖ రైల్వేజోన్ ను నిజం చేస్తున్నామన్నారు. ఆంధ్రా అభివృద్ధికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామన్నారు. కొంతమందికి వారిపై ఉన్న అవినీతి ఫైళ్లు తెరుచుకుంటాయని భయంతో ఉన్నారనీ, అలాంటివారే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇక్కడి నాయకుడు తన పనిని సరిగా చేసి ఉంటే కేంద్రంపై విమర్శలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ముఖ్యమంత్రిపై పరోక్ష విమర్శలు చేశారు. దేశమంతా పాకిస్థాన్ నుంచి జవాబు కోరుతుంటే మనదేశం మనోబలాన్ని తగ్గించే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారన్నారు! పాకిస్థాన్ పార్లమెంటులో కూడా వారి గురించి ప్రస్థావిస్తున్నారని మోడీ చెప్పారు.
తనపై ఉన్న విరోధంతో, దేశాన్ని బలహీన పరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశానికి దృఢమైన పాలన అందించాలన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో తమకు ప్రజలు అధికారం ఇచ్చారనీ, అలాంటి అవసరం రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి ఉందన్నారు ప్రధానమంత్రి మోడీ. ప్రసంగం ప్రారంభానికి ముందు ‘భారత్ మాతాకీ జై’ అంటూ జవాన్లకు వందనం చేశారు. ప్రసంగం చివర్లో కూడా వీర జవానులకు సెల్యూట్ చేస్తూ, సభలో ఉన్నవారందరితో మొబైల్ ఫోన్లలో లైట్లు వెలిగించాలని కోరారు.
విశాఖ రైల్వేజోన్ ప్రకటించడమే గొప్ప అన్నట్టుగా ప్రధాని చెప్పారు. అయితే, ఆ జోన్ వల్ల విశాఖకు పెద్దగా ప్రయోజనాలు దక్కవనే విమర్శలపై ప్రధాని స్పందించలేదు. ఇంకోటి… ఆంధ్రా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం కాబట్టే జోన్ ఇచ్చామన్నారు. మరి, అదే కట్టుబాటును ప్రదర్శించి దుగరాజపట్నం పోర్టు, రెవెన్యూలోటు భర్తీ, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణానికి సాయం… ఇలా పెండింగ్ ఉన్న దాదాపు 18 అంశాలపై ప్రధాని స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక ప్రత్యేక హోదా డిమాండ్ ఊసుకే ప్రధాని వెళ్లలేదు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన విమర్శిస్తూ, అవినీతి ఫైళ్లు తెరుచుకుంటాయనే తనపై పోరాటం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు సదరు అవినీతి ఫైళ్లపై ఉపేక్షించాల్సిన అవసరం ఏముంది..? తెరిపించేస్తే నిజాలు నిగ్గుతేలిపోయేవి కదా! మొత్తానికి, విశాఖలో ప్రధాని మాట్లాడటానికి బలమైన అంశాలేవీ లేవన్నది ఆయన ప్రసంగం చూస్తే అర్థమౌతుంది.