ఎపిక్ సినిమాలంటూ కొన్నుంటాయి. అవి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. టీవీలో వచ్చినప్పుడల్లా రేటింగులు అదిరిపోతుంటాయి. చూసిన సినిమానే అయినా – ఏదో ఓ మ్యాజిక్. దాన్నే ఇప్పుడు నిర్మాతలు కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పాత సినిమాకు కొత్త హంగులు అద్ది – రీరిలీజ్ చేస్తే ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. `పోకిరి` రీ రిలీజ్ అందుకు తాజా ఉదాహరణ.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పోకిరి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. 200 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తే (సింగిల్ షో)… అన్ని చోట్లా టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకొంటూ పోవాల్సివస్తోంది. ఓరకంగా.. ఇది న్యూ ఇండియన్ రికార్డ్! పోకిరిని టీవీల్లో ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసుంటారు. అయినా ఏమిటో ఈ క్రేజ్. పాత సినిమాకి కాస్త… 4K హంగులు అద్దారంతే. దానికే మహేష్ ఫ్యాన్స్ టికెట్లు ఎగబడి కొనేసుకొన్నారు. ఇది వరకు కూడా పవన్ కల్యాణ్ పుట్టిన రోజున హైదరాబాద్ లో గబ్బర్ సింగ్, తొలి ప్రేమ, ఖుషి, జల్సా… ఇలా నాలుగు షోల్లో నాలుగు సినిమాలు వేస్తే.. థియేటర్లకు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు `పోకిరి` రీ రిలీజ్కీ అదే స్ఫూర్తినిచ్చి ఉంటుంది.
అసలు ఈ రీ రీలీజ్ అలన్నింటికీ కారణం… మాజాబజార్. ఆ పాత మధురం లాంటి మాయాబజార్ని కలర్ లో తీసి, రీ రిలీజ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో.. కలర్ మాయాబజార్కి అంత క్రేజ్ వచ్చింది. దాంతో పాత సినిమాల్ని ఇలా.. రీ మోడల్ చేసి, రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
జనాలు థియేటర్లకు రావడం లేదన్న మాట ఈ మధ్య తరచూ వినిపిస్తోంది. అయితే అదంతా ఒట్టిమాటే అనిపిస్తోంది. ఎందుకంటే పాత సినిమాల్ని రీ మోడల్ చేస్తేనే ఈ స్థాయిలో స్పందన వస్తోందంటే, థియేటర్లన్నీ కిక్కిరిపోతున్నాయంటే, సత్తా ఉన్న సినిమా వస్తే.. దాన్ని ఆపేదెవరు? దానికి అడ్డెవరు?