మేఘా అంటే ఆషామాషీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కంపెనీపై యుద్ధాలు చేసిన వారు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేస్తారు. అంత పవర్ ఫుల్ ఎలా అయిందో ఆ కంపెనీ యాజమాన్యానికే తెలియాలి. దానికి సాక్ష్యం.. ఆ కంపెనీ చేస్తున్న తప్పులపై మాట్లాడేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం… ఇప్పటి వరకూ పోరాడిన వారే పనులు అప్పచెప్పేందుకు పోటీపడటం.
పోలవరం పనుల్ని శరవేగంగా చేస్తున్న నవయుగ కంపెనీని తప్పించి మేఘాకు ఇచ్చాడు జగన్ రెడ్డి. అప్పట్నుంచి పోలవరానికి గ్రహణం పట్టింది. వాళ్లు కట్టిన గైడ్ బండ్ కొట్టుకుపోయింది. ఇంకా అనేక సమస్యలు వచ్చాయి. పనులు రెండు శాతం ముందుకు జరగలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ ను మార్చాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ కేంద్ర మంత్రి మాత్రం.. కాంట్రాక్టర్ ను మార్చొద్దని సలహా ఇచ్చారు. ఇక్కడ పనులు ముఖ్యం.. కాంట్రాక్టర్ కాదు కాబట్టి చంద్రబాబు కూడా మార్చాల్సిందే అని పట్టుబట్టే చాన్స్ లేదు.
మేఘాకు బీజేపీ దగ్గర మాత్రమే అలాంటి పలుకుబడి లేదు.. కాంగ్రెస్ దగ్గర కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మేఘా పై ఎన్ని ఆరోపణలు చేసిందో లెక్కలేదు. ఇప్పుడు మేఘా కంపెనీకే.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎత్తిపోతల కాంట్రాక్ట్ ఇచ్చారు. సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతలలో భారీ ప్రమాదం జరిగినా ఓ అధికారిని బదిలీ చేసి సరిపెట్టారు. మేఘా జోలికి వెళ్లలేదు.
అయితే గతంలో బీఆర్ఎస్ అధినేతలు… మేఘా రెడ్లకు సన్మానాలు కూడా చేశారు. వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. దాదాపుగా ప్రతి కాంట్రాక్ట్ మేఘాకే దక్కేది. కానీ ఇప్పుడు ఆ మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు . మరి రాజకీయం అంటే అదేనేమో మరి !