హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశంలో ఏపీ సర్కార్‌కు ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. కేంద్రం 20398 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చే అవకాశం లేదని పీపీఏ చైర్మన్ అయ్యంగార్..ఏపీ అధికారులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నిర్ణయమే ఆమోదించాలని పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదననను తాను గట్టిగా వినిపించింది. టెక్నికల్ కమిటీ ఆమోదించిన రూ. 55వేల కోట్ల అంచనాలను.. కేంద్రం ఆమోదించాల్సిందేనని పట్టుబట్టింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ మాత్రం కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిన రూ.20వేల కోట్లను దాటి వెళ్లడానికి తన పరిధి లేదని తేల్చేసింది. అయితే.. ఏపీ సర్కార్ వాదనను కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి మాత్రం సానుకూలత తెలిపింది. చివరికి .. కొత్త అంచనాలను ఆమోదిస్తేనే… పెండింగ్ నిధులు రూ. 2200 కోట్లు విడుదల చేస్తామన్న షరతును సడలించి.. ఇప్పుడు ఆ పెండింగ్ నిధులు విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది. దీంతో ఏపీ సర్కార్‌కు కాస్త రిలీఫ్ వచ్చింది. మరి మిగతా అంచనాల సంగతేంటి..?
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం మినిట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. సమావేశంలో జరిగిన ప్రతీ అంశాన్ని రికార్డు చేశారు. ఇప్పుడు మినిట్స్ రూపొందిస్తారు. ఆ మినిట్స్‌లో.. సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిన రూ. 20వేల కోట్ల అంచనాలకు సానుకూలత తెలిపితే మాత్రం.. కథ సమాప్తం అవుతుంది. కేంద్రం ఇక అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అదే సమయంలో.. పీపీఏ అధికారులు మినిట్స్‌లో.. రూ. 20వేల కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదని.. సహాయ పునరావాసానికే రూ. 30వేల కోట్లు కావాలని నమోదు చేస్తే మాత్రం.. కాస్తంత ఆశ చిగురిస్తుంది. ఈ అంశాన్ని మినిట్స్‌లో పెట్టాలని ఏపీ ఉన్నతాధికారులు.. పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యంగార్ను కోరారు. దీనిపై ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
పీపీఏ కమిటీ మీటింగ్స్ మినిట్స్ రూపొందించిన తర్వాత … పీపీఏ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఏపీ అధికారులు ఉన్నప్పటికీ.. పీపీఏలో కేంద్ర అధికారులకే ఎక్కువ పట్టు ఉంది. వారు కేంద్రం చెప్పినట్లుగా నడుచుకుంటారు. ఈ ప్రకారం చూస్తే.. కేంద్రం రూ. 20వేల కోట్లకే పరిమితయింది కాబట్టి.. ఇక దాని నుంచి వెనక్కి తిరిగే ఆలోచన చేయదని అంటున్నారు. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తానికే నిధులు రీఎంబర్స్ చేయాల్సి ఉంది కాబట్టి.. ప్రస్తుతానికి ఆ ఒక్క దానికి షరతు సడలిస్తున్నామని.. ముందు ముందు ఒక్క రూపాయి నిధులు విడుదల కావాలన్నా.. కేంద్రం ఇచ్చిన సవరించిన అంచనాలను.. ఏపీ సర్కార్ అమోదించాల్సిందేనని పీపీఏ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
అంతిమంగా పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు.. ఖర్చులు.. నిధులు విషయంలో పీట ముడి పడిపోయింది. నేరుగా కేంద్రాన్ని సంప్రదించలేని నిస్సహాయతలో ఏపీ సర్కార్ ఉంది. కేంద్రాన్ని ప్రశ్నించలేని దుస్థితి కావడంతో… కింది స్థాయిలో బతిమాలటలతో ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.