ఎన్నికలు దగ్గర పడే కొద్దీ “పోలీస్ స్టోరీ”లు పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్ పోలీసులు ఏపీ రాజకీయాల కేంద్రంగా పెట్టిన కేసుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హైదరబాదాద్, సైబరాబాద్ పోలీసు పెద్దలు డేటా చోరీ అంటూ అల్లిన కథనాలు.. చూపించిన మ్యాప్‌లు సంచలనం సృష్టించాయి. అందులో కనీస కేసు కూడా లేదని ఎవరికైనా తెలుసు. కానీ పోలీస్ స్టోరీలు మాత్రం చురుగ్గా సాగాయి. చంద్రబాబును కూడా ప్రశ్నిస్తామన్నంతగా.. ఓ బీహార్ పోలీస్ బాస్ చెలరేగిపోయారు. అప్పట్లో ఏపీ రాజకీయాల్ని తెలంగాణ పోలీసులు అలా మార్చేశారు.
ఇప్పుడు మళ్లీ అలాంటి పోలీస్ స్టోరీలకు రంగం సిద్ధమయినట్లుగా తెలంగాణలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ సారి ఏపీలో కాదు.. తెలంగాణలోనే వినిపిస్తున్నాయి. దీనికి కారణం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ. పదిహేను కోట్ల సుపారీ అని ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నామని పోలీసులు ప్రకటించి.. రెండు ఆయుధాలను కూడా మీడియాకు చూపించారు. కానీ పోలీసులు చెప్పిన ఈ కన్స్పైరసీ స్టోరీ విన్న తర్వాత ఎంత అనుభవమనున్నా నమ్మించలేకపోయారని ఇతర విపక్ష నేతలు.. కొంత మంది తటస్తులు కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ప్రశాంత్ కిషోర్ ప్లాన్లు అమలు చేయడం ప్రారంభమైందని విశ్లేషించడం ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై అనర్హతా వేటు కోసం పోరాడుతున్న వారే ఈ సుపారీ హత్య కేసు ఆరోపణల్లో ఉండటమే కీలకంగా మారింది. అంతే కాదు వ్యూహాత్మకంగా మహబాబ్ నగర్ బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డికే అరుణలపైనా అనుమానం వ్యక్తం చేశారు. వారిపైనా కేసులు పెడతామన్నట్లుగా స్పందించారు. దీంతో వారికీ భయం పట్టుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే వారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు. వారు తగ్గుతారా ? లేకపోతే పోలీసులు కుట్ర చేస్తున్నారని కేంద్రం సాయంతో నిరూపిస్తారా ? అన్నది చూడాల్సి ఉంది.
రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే విషయంలో అధికార పార్టీలు గీత దాటిపోతే అరాచకమే ఏర్పడుతుంది. అది చట్టాన్ని అపహాస్యం చేస్తుంది. ఈ విషయంలో వ్యవస్థను కాపాడాల్సింది ఉన్నతాధికారులే. వారు కాపాడితే వ్యవస్థ బలంగా ఉంటుంది.. ప్రజలకు మేలు జరుగుతుంది.. లేకపోతే వ్యవస్థ కుప్పకూలడంలో వారు భాగస్వామ్యం అయినట్లవుతుంది. అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు.