టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, ఆయన సహచరుడు ఆపరేషన్ గరుడ సిద్ధాంతకర్త శివాజీ ల కోసం పోలీసుల గాలింపు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవి ప్రకాష్ కోసం పోలీసులు 160 సీఆర్పీసీ , 41 సీఆర్పీసీ ల కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఇటు రవి ప్రకాష్, అటు శివాజీ తమ వాదనను వినిపిస్తూ వీడియో బైట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే
అయితే రవి ప్రకాష్ నుండి ఈ నోటీసుల మీద పోలీసులకు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, పోలీసులు రవి ప్రకాష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మీడియాకు వచ్చిన సమాచారం మేరకు చూస్తే, మొదట్లో ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక రిసార్ట్ లో రవి ప్రకాష్ దాక్కున్నట్లుగా, ఆ తర్వాత అక్కడి నుండి బెంగుళూరుకు మకాం మార్చినట్టుగా, ఆ తర్వాత మళ్లీ అక్కడ నుండి గుజరాత్ పారిపోయినట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఇటు రవిప్రకాష్ కోసం, అటు శివాజీ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆచూకీ లభించినట్లయితే వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.