ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 317 జీవోను విడుదల చేసింది. అయితే ఉద్యోగులకు అందులో ఉన్న నిబంధనలు నచ్చలేదు. దీంతో ఇది రాజకీయం అయిపోయింది. వెంటనే జీవో మార్చాలంటూ కార్యక్రమాలు ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో పార్టీ ఆఫీసులో దీక్ష చేశారు. రాజకీయ దీక్షే కదా అనుకున్నారు కానీ పోలీసులు మాత్రం దాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చేశారు. రాత్రి పది గంటల తర్వాత పోలీసులు ఒక్క సారిగా ఎంపీ ఆఫీసును చుట్టుమట్టి లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించేలా చేశారు. స్వయంగా సీపీ సత్యనారాయణ కూడా లాఠీఛార్జి చేశారు.
నిజానికి పార్టీ ఆఫీసుకు రాక ముందే బండి సంజయ్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ సిరిసిల్ల నుంచి బైక్ మీద వచ్చిన బండి సంజయ్ పోలీసుల కన్నుగప్పి పార్టీ ఆఫీసులోకి వెళ్లి తాళం వేసుకున్నారు. దీంతో పోలీసులకు మరింత కోపం వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు పగలగొట్టారు. కిటికీల్లోంచి స్ప్రింక్లర్ల ద్వారా లోపలికి నీటిని చిమ్మారు. గ్యాస్ కట్టర్లతో గేట్లు తొలగించి గునపాలతో తలుపులు తెరిచారు. ఆ తర్వాత సంజయ్‌ని బలవంతంగా ఎత్తుకొచ్చి, అరెస్టు చేసి జీపులో తీసుకెళ్లారు.
పోలీసుల నిర్బంధాలే బీజేపీ నేతల్ని మరింతగా రెచ్చగొట్టాయి. ఒమిక్రన్ నిబంధనల పేరుతో ముందు నుంచి పోలీసులు సభకు అనుమతి లేదని హెచ్చరిస్తూ రావడంతో పట్టుదలగా తీసుకున్నారు. టీఆర్ఎస్ నేతలకు లేని రూల్స్ తమకు ఎందుకు అని ఇప్పటికే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మామూలుగా అయితే దీక్ష నిర్వహించిన తర్వాత కేసులు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం అసలు సభ జరగకూడదన్న పట్టదలకు పోలీసులు పోయారు. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.