ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ అహంకారానికి.., కడప పౌరుషానికి మధ్య పోరాటం ప్రారంభించబోతున్నట్లుగా వైసీపీ వర్గాలు అంచనా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ రకంగానూ సహకారం లభించకపోవడానికి తోడు.. తాజా ఆర్థికంగా నట్లు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు..జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో ప్రారంభమయ్యాయి. పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు వ్యూహం పన్నారని అనుమానిస్తున్నారు. అదే సమయంలో తన కేసుల విషయంలో.. ఎలాంటి భరోసా లేకపోవడం కూడా.. ఆయనను అసహనానికి గురి చేస్తోందని అంటున్నారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. రాజ్యసభలో మద్దతు ఇస్తున్నామని.. రాజ్యసభ సీటు కూడా ఇచ్చామని అయినా తమకు ఏ మాత్రం సహకారం లేదన్న అసంతృప్తి జగన్‌లో కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ హైకమాండ్‌పై పోరాడారు. తన తండ్రి మృతిని తట్టుకోలేక.. గుండె పగిలి చచ్చిపోయిన వారిని భారీ ఊరేగింపుగా వెళ్లి ఓదార్పుయాత్ర చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదని.. తన తండ్రిని అవమానించారని చెప్పిన ఆయన పోరాడి.. సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు.. ఢిల్లీ అహంకారానికి.., కడప పౌరుషానికి పోరాటం అన్నారు. అప్పుడు కూడా.. కాంగ్రెస్ అధికార పార్టీ. అయినా వెనక్కి తగ్గలేదు. తనపై కేసులు.. కాంగ్రెస్ ను ధిక్కరించడం వల్లనే వచ్చాయని ఆయన ఇప్పటికీ చెబుతూంటారు. ఇప్పుడు.. ప్రభుత్వంలో ఉన్నా.. కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కేంద్రంలో తిరుగులేని ప్రభుత్వం ఉంది. సొంత పార్టీ నేతలైనా..ఇతరులైనా ప్రశ్నించే సాహసం చేయలేనంత బలమైన ప్రభుత్వం ఉంది. అందుకే.. అనేకానేక రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉంటున్నాయి. వీటిలో వైసీపీ కూడా ఉంది. మిగతా పార్టీలు.. సైలెంట్‌గా ఉన్న ఇబ్బందేమీ ఉండదు.. కానీ అధికార పార్టీగా.. ఏపీ ప్రయోజనాలను కాపాడాల్సిన పార్టీగా.. వైసీపీకి కొంత బాధ్యత ఉంది. ప్రజలు జగన్ పాలనపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ కేంద్రం సహకారం లేకపోగా.. మరింతగా ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న అభిప్రాయం జగన్‌తో పెరుగుతోందంటున్నారు. అది మాత్రమే కాకుండా.. జరగబోయే పరిణామాల ప్రకారం కూడా కేంద్రంపై పోరాటం చేస్తేనే… ఏం జరిగినా తలవొంచలేదన్న అభిప్రాయం కల్పించడానికైనా.. పోరాటం చేయాల్సి ఉంటున్న చర్చ వైసీపీ పెద్దల్లో నడుస్తోందని చెబుతున్నారు.