చూశారా మోదీగారు కుర్చీ వేసుకుని కూర్చోగానే మల్దీవులు మడతపడిపోయింది అని.. ఆ దేశానికి టూరిజం బూకింగ్స్ క్యాన్సిలేషన్లు చూపించి కొంత మంది దేశభక్తులు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రధాని మోదీపై అక్కడి మంత్రులు చేసిన విమర్శలతో మరింతగా బాయ్ కాట్ మాల్దీవులు ఉద్యమం చేశారు. ఆ మాటలు అన్న వారిని వెంటనే తొలగించినట్లుగా మాల్దీవులు అధ్యక్షుడు ప్రకటించినా .. తగ్గడం లేదు.
లక్షదీవులకు మాల్దీవులు అడ్డమా ?
మాల్దీవుల వల్లే లక్ష దీవులు టూరిజం పరంగా అభివృద్ధి చెందడం లేదన్నట్లుగా చాలా మంది చెప్పుస్తున్నారు. ఇది చేతకానితనం కాదా. లక్ష దీవులు భారత్ వి. ఇప్పుడే కాదు… స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారత్ వే. ఎందుకు టూరిజం స్పాట్ చేయలేకపోయారు. లక్షల మంది మాల్దీవులు వెళ్తూంటే.. వేలల్లో అయినా లక్ష దీవులకు వెళ్లేలా ఎందుకు ప్రమోట్ చేయలేకపోయారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మాల్దీవులతో పోల్చి మోడీ ఫోటో షూట్ చేస్తేనే.. అందరికీ తెలుస్తోందా ? ఫోటో షూట్ చేసుకుంటే టూరిస్టులు వస్తారా.. మౌలిక సదుపాయాలు పెంచితే వస్తారా ?
మాల్దీవులతో పోలిస్తే ఒక్క శాతం అయినా మౌలిక సదుపాయాలు లేని లక్ష దీవులు
మాల్దీవులు టూరిస్ట్ ప్లేస్. అక్కడ ఉండే ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కానీ.. అక్కడకు వెళ్లకుండా లక్ష దీవులకు రావాలని ఎవరూ కోరుకోరు. టూరిస్టుల మైండ్ సెట్ గురించి కనీసం తెలిస్తే ఇలాంటి ఆలోచనలు చేయరు. ఎక్కడకు వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్తారు. లక్షదీవులకు వెళ్లాలంటే.. అక్కడికే వెళ్తారు. మాల్దీవులకు ఎందుకు వెళ్తారంటే..అక్కడ ఉండే సౌకర్యాలే. పైగా వారి మార్కెటింగ్ వేరేగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్లకు ఉచిత హాలీడే ప్యాకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటారు. ఇదంతా టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వారికి తెలుసు. ముందుగా మాల్దీవులను దాటాలంటే… ఇలా దేశంపై దండయాత్రలా భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాకుండా.. మౌలిక సదుపాయాల్నిపెంచి.. ఆకట్టుకోవాలి.
శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం అంత జనాభా ఉన్న దేశంపై ప్రతాపమా ?
మాల్దీవులు అతి చిన్న దేశం. పూర్తిగా టూరిజం మీద ఆధారపడిన దేశం. ఇంకో యాభై ఏళ్లకు ఉంటుందో.. సముద్రంలో కలిసిపోతుందో తెలియని దేశం. ఆ దేశ జనాభా ఐదు లక్షలు. అంటే శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నంత మంది జనం. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంతో సరిపోని జనాభా ఉన్న దేశంపై వంద కోట్ల మందిని రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారో మాత్రం అర్థం కాదు. నిజానికి మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో 135 కోట్ల మందికి అటు మాల్దీవ్స్ కు కానీ ఇటు లక్ష దీవులకు కానీ వెళ్లే స్థోమత లేదు. అంత డబ్బులే ఉంటే… మధ్యతరగతి జీవితానికి అవసరమైన ఏ వస్తువో కొనుక్కవాలనుకుంటారు. కానీ ఈ పేరుతో చేస్తున్న రచ్చలో అందర్నీ భావోద్వేగాలకు గురి చేస్తున్నారు.