రాజకీయానికి జాలి, దయ ఉండవు, బీఆర్ఎస్ విషయంలో మరోసారి అదే రుజువు అవుతోంది. బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రాణం ఇస్తామన్నట్లుగా వ్యవహరించిన నేతలు పవర్ పోయాక నిర్దాక్షిణ్యంగా .. కనీసం పోటీ కూడా చేయబోమంటూ చెప్పి పక్క పార్టీలకు వెళ్లిపోతున్నారు. వ్యాపారాలకు సమస్యలు వస్తాయని.. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే గెలవలేమని ఇలా కబుర్లు చెబుతున్నారు. కవిత అరెస్టు వ్యవహారం తర్వాత మరిన్ని సమస్యలు బీఆర్ఎస్ చీఫ్ ఎదుర్కొంటున్నారు. కుమార్తె అవినీతి కేసులో అరెస్టు కావడం ఆయనకు పెద్ద సమస్యే. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన వారు… గుడ్ బై చెప్పి.. వెళ్లిపోతూండటం ఇబ్బందే.
కవితను అరెస్టు చేస్తున్నప్పుడు గ్రేటర్ చుట్టూ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరూ రాలేదు. కనీసం ధర్నాలు చేయించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ధర్నాలకు కేటీఆర్ పిలుపునిస్తే పట్టించుకున్న వారు లేరు. కానీ కాంగ్రెస్ లో చేరేందుకు మాత్రం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఇద్దరూ కాంగ్రెస్ గేటు దగ్గర రెడీగా ఉన్నారు. దానం నాగేందర్… ఉదయం ఖండించి మధ్యాహ్నం కాంగ్రెస్ లో చేరిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా అంతే. అసలు రాజకీయానికి ఎవరో తెలియని ఆయనను..కేసీఆర్ తీసుకు వచ్చి ఎంపీని చేశారు.
కవితను అరెస్టు చేసినా కనీసం ఖండించని వారు మెజార్టీ నేతలు ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్నట్లుగా మారింది కానీ.. బీఆర్ఎస్ లో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్.. వ్యాపారస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఈ సమస్య వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ పరమైన వేధింపులను తట్టుకోలేమన్న కారణాన్ని చెప్పి ఎక్కువ మంది జంప్ అవుతున్నారు. కేసీఆర్ మళ్లీ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.