ముందస్తుగా తెలంగాణ అసెంబ్లీ తీసుకొచ్చి.. ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్.. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని.. అదే ఏపీపై పెత్తనానికి వస్తున్నారు. ఆంధ్రాపై వ్యతిరేకతే.. ప్రజల్లో నూరిపోసి ఉద్యమ మంటలు వేసి.. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆ తెలివితేటల్ని ఏపీని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రభావం ఏపీ ప్రజలపై స్పష్టంగా కనిపిస్తోంది. మనల్ని తిట్టినోళ్లు.. మన మీద పెత్తనానికి రావడం.. మన పోర్టుల్ని కాజేయాలనుకోవడం ఏమిటన్న చర్చ అంతటా జరుగుతోంది.
మా రాష్ట్రంపై తెలంగాణ పెత్తనమేంది..?
భావోద్వేగం చాలా బలమైన అంశం…! అందుకే ఎన్నికల సమయంలో నేతలు భావోద్వేగానికి ప్రాధాన్యత ఇస్తూంటారు. ప్రజల్లో కూడా సెంటిమెంట్ ను రగిల్చేందుకు ప్రయత్నిస్తుంటారు. తెలంగాణా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్ధి ప్రజాకూటమికి ఓటు వేస్తే పాలన అమరావతి నుంచి సాగుతుందని ప్రజలకు పదేపదే చెప్పారు. తెలంగాణా ప్రజల్లో అది బలంగా నాటుకుపోయింది. ఫలితాలు అలాగే వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. ప్రతిపక్ష నేత వైస్ జగన్మోహనరెడ్డిని ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేటీఆర్ కలిసినప్పుడు ఏపీ ప్రజల్లో చాలా ఆగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఏపీ జుట్టు.. తెలంగాణ పోలీసుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. గెలిపిస్తే.. పోర్టు రాసిస్తాననే హామీ ఇచ్చినట్లు ప్రచారం జరగడం.. కలకలం రేపుతోంది. దీనిపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
పోలీసులతో బెదిరించి పోర్టులు కొట్టేస్తారా..?
ఎమ్మెల్యేలను కొంతమందిని బెదిరించడం, హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్ లు చేసి, ఆస్తులు దక్కాలంటే పార్టీ మారాలని, ఒకవేళ కుదరకపోతే నామినేషన్ వేసి సైలెంట్ గా సైడ్ అయిపోవాలని హైదరాబాద్ నుంచి వస్తున్న బెదిరింపులు ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగ శైలిని మార్చి, ఈ సెంటిమెంట్ పై ప్రశ్నలు వేసి బహిరంగసభల్లో, రోడ్ షోలో ప్రజల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. కేసీఆర్ కు.. సామంతరాజు జగన్ అని వ్యాఖ్యానించడంతో పాటు, పోలింగ్ తేది నాటికి కూడా లోటస్ పాండ్ విడవని జగన్ ఆంధ్రావాడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. కోడికత్తి కేసులో ఆంధ్రా పోలీసులు, ఆంధ్రా డాక్టర్ల పై నమ్మకం లేదన్న జగన్ ఆంధ్రావాళ్లను ఓటు ఎలా అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం.
ఏపీ ఎప్పటికీ సామంత రాజ్యం కాబోదు..!
కేసీఆర్ చెప్పనట్లు నడుచుకునే జగన్ కావాలా…? ఏపీ కోసం పోరాడేవాళ్లు కావాలా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ యువత అభిప్రాయాలను పవన్ కల్యాణ్.. నేరుగా వెల్లడిస్తున్నారు. కేసీఆర్…మా జోలికి రావద్దు…మా బతుకు మమ్మల్ని బతకనివ్వు అంటూ ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ లో భూములున్న వారిని భయపెడతారా… మా పార్టీలోకి వస్తానన్న వారిని అడ్డుకున్నారు. జగన్ తో పొత్తుకు నాపై ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ ను జగన్ తలకెత్తుకుంటున్నారు. వైసీపీ నేతలకు పౌరుషం లేదా,…ఆంధ్రా పుట్టక పుట్టలేదా..అంటూ పవన్ కళ్యాణ్ భీమవరంలో చేసిన ప్రసంగం… ప్రజల్లో భావోద్వేగం ఉవ్వెత్తున ఎగసి పడేలా చేసింది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా… కేసీఆర్ పెత్తనంపైనే చర్చ జరుగుతోంది. ఫలితాలను మార్చేది కూడా ఇదే కాబోతోంది.