కాంగ్రెస్ మారాజు రాహుల్ గాంధీకి ప్రత్యేక విమానంలోనో హెలికాఫ్టర్ లోనో ఆకాశయాత్రలు చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ, దుమ్ము ధూళిలో ఎండలో కష్టపడి పాదయాత్రలు చేస్తున్నారు…ఎవరి కోసం?ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఓదార్చడం కోసం! కానీ ఆమాట కాంగ్రెసోళ్ళు తప్ప మరెవరూ నమ్మడం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు ఆయన ఇలాగ పాదయాత్రలు చేయలేదు…డబ్బులూ పంచిపెట్టలేదు కదా? అని వితండవాదం చేస్తున్నారు.
ప్రతిపక్షాలదేముంది…వాళ్ళ నాలిక్కి నరం ఉండదు. దేశంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులందరికీ డబ్బులు పంచిపెట్టాలంటే ఇంకా ఎన్ని కుంభకోణాలు చేయాలో వారికేమి తెలుసు? కానీ 10 ఏళ్లలో ముచ్చటపడి ఓ 10 కుంభకోణాలు, అంటే సగటున ఏడాదికి ఒక్కటి మాత్రమే చేసుకొన్నా కాంగ్రెస్ పార్టీ ఏదో దేశ సంపదంతా కొల్లగొట్టేస్తోందన్నట్లు గగ్గోలు పెట్టేసి చివరికి అధికారం ఊడగొట్టేవరకు వదిలిపెట్టలేదు. పోనీ ఇప్పుడు ఎలాగూ మరేపనీ లేదు…ఇంట్లో తన కోసం ఎదురుచూసే పెళ్ళాం పిల్లాలూ కూడా లేరు కదా…అని పాపం..ఆయన ఎండనక వాననకా కష్టపడి పాదయాత్రలు చేసి వాళ్ళూ వీళ్ళూ ఇచ్చినదేదో ఆ రైతు కుటుంబాల చేతిలో పెడుతుంటే దానికీ ప్రతిపక్షాలు ఏడుపే!
తెదేపా నేతలయితే మరీను. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? అని ఒకరడిగితే, ఆయన కాలు పెడితేనే రాష్ట్రం అపవిత్రమయిపోతుందని మరొకరు. కాదు..కాదు…ఆయన లెగ్గు పెట్టిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ మటాష్ అయిపోతోంది కనుక ఆయన లెగ్గు దెబ్బకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనబడకుండా మాయమయిపోతుందని సెటైర్లు. మరి అటువంటప్పుడు ఆయన లెగ్గు పెట్టినందుకు తెదేపా వాళ్ళు ఆయనకి ఎదురేగి హారతిచ్చి మెళ్ళో దండేసి ఘనంగా స్వాగతం పలకొచ్చుకదా? కానీ అలా చేయరు. ‘శాస్త్రం శాస్త్రమే..ఫాలో అయిపోవలసిందే’ అంటూ నల్ల జెండాలు పట్టుకొని నిరసనలు తెలిపారు.
అయినా అందరూ పాపం రాహుల్బాబుని ఆడిపోసుకొంటారు కానీ అసలు ఆయన ఏమి చేసారని? ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోమని పదేళ్ళ క్రితమే మమ్మీ చెప్పినా ఆయన కూర్చోకుండా ఉపన్యాసాలు ఇస్తూ కాలక్షేపం చేసేసారు. తీరాచేసి కూర్చోవాలనుకొనే సరికి ఎవరో మోడీ అట అప్పటికే అందులో సెటిల్ అయిపోయాడు. ఆయన మళ్ళీ ఇప్పుడప్పుడే లేచ్చెట్లు కూడా లేడు. అందుకే ఇప్పుడు రాహుల్ బాబు ప్రధాన మంత్రి అవుతారని చెప్పుకోకుండా పార్టీ అధ్యక్షుడు అవుతారని మాత్రమే కాంగ్రెసోళ్ళు చెప్పు కొంటున్నారు…ట!
కాంగ్రెస్ హాయంలో బోలెడన్ని కుంభకోణాలు జరిగి ఉండవచ్చును. రాబర్ట్ బావగారు కూడా చిలక్కొట్టుడు కొట్టి ఉండవచ్చును. కానీ రాహుల్ బాబు మాత్రం ఎక్కడా నొక్కేసినట్లు వినబడలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన అవినీతి నిర్మూలన, రాజకీయ ప్రక్షాళన, మహిళా సాధికారత, దేశాభివృద్ధి వంటి అనేక అంశాలపై అనర్గళంగా ప్రసంగిస్తూ స్కూలు పిల్లలకు, రిక్షా త్రొక్కేవాళ్ళకు తన అపార జ్ఞానాన్ని పంచిపెట్టడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన్ని అస్సలు తప్పు పట్టడానికే లేదు. అంతా మమ్మీయే చూసుకొంది.కానీ కవితమ్మ అన్న మాటలకి జీవన్ రెడ్డికి చాలా కోపం వచ్చేసింది.
“తెలంగాణా ఇచ్చిన సోనియమ్మని మీ తండ్రి పొగుడుతుంటే, పాపం…అన్నెం పున్నెం తెలినీ ఆమె కొడుకు ఏదో ముచ్చటపడి పాదయాత్రలు చేసుకొంటుంటే “గోదాట్లో మునుగు…నీ పాపాలు పోతాయి అంటావా? ఎంత అహంకారం నీకు?” అంటూ కోప్పడిపోయాడు. అసలు రాష్ట్ర విభజనే కాదు…ఏ విషయంలోనూ మా బాబు వేలు పెట్టలేదు…ఎప్పుడూ తన ఉపన్యాసాలు…అమేధీలో పేదల కంచాల్లో పెట్టుకొన్న అన్నం తిని వస్తుండటం, వీలయితే వాళ్ళ పిల్లల ముక్కు చీమిడి తుడుస్తూ ఫోటోలు తీయించుకోవడం అంతే తప్ప వేరే ఆలోచనే ఉండేది కాదు…పార్లమెంటులో కూడా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వెనుక బెంచీలలో కునుకు తీస్తుంటే మోడీ అంతటి వాడు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడంటే నమ్మండి,”అని మళ్ళీ కాంగ్రెసోళ్ళే గొప్పగా చెప్పుకొంటారు.
ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోనే భాగ్యం ఎలాగూ ఇకలేదు కనుక పోనీ కనీసం మమ్మీ ఖాళీ చేస్తే ఆమె కుర్చీలోనయినా కూర్చొందామనుకొంటే మళ్ళీ వాళ్ళే, “మీకంత సీను లేదు బాబుగారు” అని గౌరవంగా చెప్పేసరికి రాహుల్ బాబు ఎంత హర్టయి ఉంటారో ఎవరికి తెలుసు? అందుకే ఆయన అలిగి ఓ రెండ్నెల్లు కాంగ్రెస్ పార్టీకి శలవు పెట్టి విదేశాలలో ఓ రౌండేసి ధైర్యం సంపాదించుకువచ్చేరు. ఎప్పుడు డిల్లీ…అమ్మేదీ…అంటూ తిరిగితే దేశంలో మిగిలిన జనాలకి సోనియమ్మ కొడుకనే తప్ప తన పేరు కూడా తెలుసుకోలేకపోతున్నారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసుకొంటుంటే దానికీ ఈ జనాలు ఏడుపే…ఏమిటో పాడు లోకం మంచివాళ్ళకి చోటే లేదు.