దర్శకుడు త్రివిక్రమ్ రాజకీయాలకు దూరంగా ఉండే మనిషి. కాంట్రవర్సీల్లో ఏమాత్రం తలదూర్చడు. పవన్ కల్యాణ్ కోసం ‘బ్రో’లో కొన్ని పొలిటికల్ పంచ్‌లు రాయాల్సివచ్చింది. అవి బాగానే పేలాయి. అయితే ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ పొలిటికల్ ఘాటు ఉండబోతోందని సమాచారం.
అతడు, ఖలేజా తరవాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘గుంటూరు కారం’. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సీజన్లో విడుదల కావడం మరింత ప్లస్. ఈ సినిమా కథేమిటి? హీరో ఏం చేస్తుంటాడు? అనే విషయాల్ని చిత్రబృందం ఇప్పటి వరకూ దాచే ఉంచింది. అయితే ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు మేళవించారని తెలుస్తోంది. గుంటూరు మేయర్ రాజకీయాల చుట్టూ ఈ కథ నడుస్తుందట. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెని మేయర్ చేసే బాధ్యత మహేష్ పై పడుతుందట. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం ‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకొన్నారు. ఆ టైటిల్ మరీ క్లాస్ అయిపోయిందని భావించిన ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ – మహేష్‌ల మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుబతాయని తెలుస్తోంది. పాటలూ, మహేష్ గెటప్, టైటిల్ ఇవన్నీ మాసీగా ఉన్నా, ఆ సన్నివేశాలు మాత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయని సమాచారం.