సభ్య సమాజం తల దించుకునేలా 50 ఏళ్ల పైబడిన వ్యక్తి 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆ బాలిక ఈ వేధింపులు తాళ లేక ఆత్మ హత్య చేసుకున్న సంఘటన విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంఘటన కూడా రాజకీయ రంగు పులుముకుంది. వివరాల్లోకి వెళితే..
సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన:
విజయవాడ భవానిపురం లో నివసించే 14 ఏళ్ల బాలిక పై అదే అపార్ట్ మెంట్ లో నివాసముండే 50 ఏళ్ల వినోద్ జైన్ అనే వ్యక్తి కన్నేశాడు. బాలిక లిఫ్ట్ లో , మెట్ల దగ్గర ఎక్కడ కనిపించినా అక్కడ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆ అమ్మాయి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇంగ్లీష్ లో ఉత్తరం రాసిన ఆ అమ్మాయి, మరే ఇతర సమస్య అయినా తాను దానిని హ్యాండిల్ చేసుకోగలిగే ఉండేదానిని, కాని ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదని, తల్లిదండ్రులకు చెబితే వారెలా దీనిని తీసుకుంటారో తెలియక ఆత్మహత్య చేస్తున్నానని రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టించింది. అయితే ఈ వివాదం కూడా మిగతా వివాదాల లాగే రాజకీయ రంగు పులుముకుంది.
తెలుగు దేశం పార్టీ పై వైఎస్ఆర్సిపి మాటలు దాడి:
వినోద్ జైన్ అనే ఈ నీచుడు తాజా గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు. గతంలో 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు. అయితే రోజా వంటి వైఎస్ఆర్ సీపీ నేతలు ఇతగాడికి ఉన్న తెలుగు దేశం లింకు లని అడ్డం పెట్టుకుని తెలుగు దేశం పార్టీపై విరుచుకుపడ్డారు. పని లో పని గా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో జరిగిన కాల్ మనీ వంటి వివాదాలను తెర మీదకు తీసుకుని వచ్చారు.
వైఎస్సార్సీపీ పై తెలుగు దేశం రివర్స్ అటాక్:
అయితే మరొక వైపు తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై దీక్షకు కూర్చున్నారు. ఈ నీచుడికి వైఎస్ఆర్ సీపీ నేత వెల్లంపల్లి తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతడు ఆ వైఎస్సార్సీపీ నేతలతో ఉన్న ఫోటోలను సైతం మీడియాకు విడుదల చేస్తున్నారు. పనిలో పనిగా వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని, వై ఎస్ ఆర్ సి పి హయాం లో మహిళలపై జరిగిన అఘాయిత్యాల మీద చర్చకు సిద్ధమని అనిత వంటి టిడిపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జనసేన స్పందన:
మరొక వైపు జన సేన నేతలు సైతం ఈ సంఘటన పై మాట్లాడుతూ, ముఖ్య మంత్రి నివాసానికి సమీపంలోనే ఈ సంఘటన జరిగిందని, ముఖ్యమంత్రి దిశ యాప్ లాంచ్ చేసిన పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో బాధితురాలి ఇల్లు ఉందని గుర్తు చేస్తూ, వినోద్ జైన్ కి శిక్ష పడకపోతే , అతనికి శిక్ష పడేలా అధికారుల చేత తగినన్ని ఆధారాలు సమర్పించ లేకపోతే, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవలసి వస్తుందని జన సేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వినోద్ జైన్ అనే ప్రబుద్ధుడు గతంలో ప్రజారాజ్యం మరియు బిజెపి లలో కూడా పని చేసినట్లు సమాచారం.
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఇలాంటి నీచులకు శిక్షలు పడేలా చేయాల్సిన తరుణంలో కూడా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించడం సిగ్గుచేటు. పార్టి లకు అతీతంగా ఈ నీచుడికి శిక్షపడేలా రాజకీయ నాయకులు ఏకం కావలసి ఉంది. దీనికి తోడు టీనేజ్ అమ్మాయిలను ఇటువంటి సంఘటనలను ఎదుర్కొనేందుకు ధైర్యం పెంపొందించేలా తగిన కౌన్సిలింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. టీనేజ్ లో ఉన్న ప్రతి విద్యార్థిని కి ఇటు వంటి సమస్యల పై అవగాహన, దానిని హ్యాండిల్ చేసుకునే విధానం తెలిసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.