అతడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వీఐపీ ఖైదీ. రాజకీయంగా అంతర్గత పలుకుబడి ఉంటుంది. కానీ ప్రజల్ని మోసం చేయడంలో మాత్రం దిట్ట. ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల ఆయనను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. తర్వాత బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయనను ఉంచిన సంగారెడ్డి , చర్లపల్లి జైళ్లలోని నలుగురు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఆ అధికారులు నలుగురూ ఈ ఏపీకి చెందిన అవినీతి ఖైదీకి వీఐపీ సౌకర్యాలు కల్పించారు.
కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత వారికి ఖరీదైన వాహనాలు వచ్చాయి. ఆ వాహనాల్లో వారు చక్కర్లు కొడుతూంటే ఇతరులకు కోపం రాకుండా ఉంటుందా..? తోటి ఉద్యోగులే ఆ నలుగురూ ఎంత అవినీతి చేశారో వివరిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి… ఆ వాహనాలు ఎలా వచ్చాయో ఆరా తీశారు. ఖైదీ నుంచే తీసుకున్నట్లుగా ఆధారాలు లభించడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రజల సొమ్మును దోచేసిన వ్యక్తికి జైల్లో కూడా రాచ మర్యాదలు చేసి తాత్కాలికంగా ప్రయోజనం పొందారేమో కానీ.. వారి సర్వీసులో మాత్రం మాయని మచ్చ పడింది. ఇప్పుడు వారిని ఎక్కడ ఉద్యోగంలోకి తీసుకున్నా.. ఎక్కడా నమ్మని పరిస్థితి ఉంటుంది. అందుకే.. అవినీతి పరులతో స్నేహం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ ఉంటారు. మరి మిగిలిన వాళ్లైనా పాఠాలు నేర్చుకుంటారో లేదో..?