2022 వెళ్లిపోయింది. ఏం జరిగిందన్నది ఇక గతం. 2023 వచ్చేసింది. ఈ ఏడాది ఏం జరుగుతుందని ఒక్క సారి తరచి చూస్తే.. ఉలిక్కి పడటం ఖాయం. ఎందుకంటే 2023 ఆషామాషీ ఏడాది కాదు. తెలంగాణకు ఎన్నికలకు సంవత్సరం. ఏపీకీ ఎన్నికల సంవత్సరం కావొచ్చన్న నమ్మకం ఉంది. అంటే… ఏడాది మొత్తం.. దాడులు.. దౌర్జన్యాలు.. ఓట్లు… ప్రచారాలు… ఇలా హై వోల్టేజ్‌తో సాగనుంది.
తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరగడం ఖాయమే !
తెలంగాణలో కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ అనేక సవాల్లు ఎదుర్కోబోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు బీజేపీ చేతికి చిక్కింది. ఈ కేసులో కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆయనను నమ్మిన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నిండా మునగబోతున్నారు. బీఆర్ఎస్ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థ గుప్పిట్లో ఉండబోతున్నారు. అదే సమయంలో.. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది. షెడ్యూల్ ప్రకారం జరిగితే నవంబర్ , డిసెంబర్ నెలలో పోలింగ్ జరుగుతుంది. ఈ సారి కూడా ఓ ఐదారు నెలలు ముందస్తు ఎన్నికలు పెట్టవచ్చని చెబుతున్నారు. అది మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాతనా లేకపోతే.. సెప్టెంబర్ అక్టోబర్‌లోనా అన్నది తేలాల్సి ఉంది.కానీ ఈ ఏడాది ఎన్నికలు మాత్రం ఖాయం. ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. బీఆర్ఎస్ చేయాలనుకుంటుంది కానీ చేయడం కష్టం. అందుకే… ఓ రకంగా ఈ ఏడాది బీఆర్ఎస్ కు పెను సవాల్ లాంటిదే.
ఏపీలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఉండేంత ఉద్రిక్తత !
ఆంధ్రప్రదేశ్ రాజకీయం బీహార్ స్థాయి అరాచకానికి ఎప్పుడో చేరిపోయింది. ఢిల్లీ పర్యటనలో సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తామని సహకరించాలని ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి స్పందనేమిటో స్పష్టత లేదు కానీ.. వైఎస్ఆర్సీపీ మదిలో ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందన్న ఓ అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో బలపడిపోయింది. ఇప్పటికే ప్రజాస్వామ్యానికీ అర్థం మారిపోయింది. తమకు పట్టున్న ప్రాంతంలో ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయంటే సహించలేని పరిస్థితి వచ్చేంది. దాడులు చేస్తే తాము తగ్గుతామా అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ముందుకెళ్తున్నాయి. ఈ ఏడాది అధికార అరాచకాలు గరిష్టంగా ఉంటాయి.
ఏపీ రాజకీయాల్ని మలుపు తిప్పనున్న పొత్తులు
ఏపీలో ఈ ఏడాది ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయని చెప్పలేం. కానీ రావని కూడా చెప్పలేం. అధికార పార్టీ వ్యూహం ప్రకారం… ఈ ఏడాది ఏపీలో రాజకీయాలు మారిపోతాయి. ఎలా మారినా.. రాజకీయం మాత్రం ఏపీలో చాలా ఉద్రిక్తంగా ఉండటం ఖాయం అనుకోవచ్చు. కానీ పొత్తులు మాత్రం రాజకీయాల్ని మలుపు తిప్పుతాయి. చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్రం మొత్తం ఓ అంచనాకు వచ్చింది. ఈ ఏడాది పొత్తులతోనే రాజకీయం మలుపులు తిరగనుంది.