ఓ వైపు ఓటింగ్ జరుగుతూండగా.. మరో వైపు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిపోయాడంటూ.. ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా.. ప్రముఖ మీడియా చానళ్ల లోగోలతో ఉండటంతో.. అందరూ ఉలిక్కిపడ్డారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. ప్రముఖ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పార్టీతో కుమ్మక్కయిన మీడియా కావాలనే తనను బద్నాం చేస్తోందని.. దారుణమైన నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహంతో.. అగ్ర టీవీ చానల్.. వెంటనే స్పందించింది. తమ టీవీ చానల్ లోగోతో.. కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని.. తమకేమీ సంబంధం లేదని ప్రకటించింది. తాము కూడా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. అయినా ప్రచారం మాత్రం ఆగలేదు. ఓ రకంగా.. టీవీ9 వేసిన అ ప్రకటనే మరింతగా ఉద్దృతంగా ప్రచారం జరగడానికి కారణం అయింది. ఆ తర్వాత ఉత్తమ్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు.. తప్పుడు ప్రచారంపై పోలింగ్ ముగిసేలోపు చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
మొత్తానికి పోలింగ్ ముందు గంటల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ… టీఆర్ఎస్ కు పడేలా.. ఓ ప్రచారాన్ని మత్రం ఉద్ధృతంగా నిర్వహించారు. మొదటి నుంచి బీజేపీని ప్రత్యర్థిగా చూస్తూ వచ్చిన అధికార పార్టీ చివరికి వచ్చే సరికి.. కాంగ్రెస్ ఓట్ల చీలికకు భారీ పన్నాగం పన్నిందని కాంగ్రెస నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది.