విజయవాడ పోలీస్ కమిషనర్గా డీఐజీ పాలరాజు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయి సీపీగా బాధ్యతలు తీసుకున్నారా.. ఇంచార్జి సీపీగా తీసుకున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కమిషనర్ బదిలీ కాక ముందే ఆయన ఇంచార్జీ సీపీగా ఉన్నారు. ఆ హోదాలోనే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదంపై హైకోర్టులోనూ హాజరయ్యారు. సీపీ బత్తిన శ్రీనివాసులు రిటైర్ అయిన రోజున ఆయనచేతుల మీదుగా మళ్లీ బాధ్యతలు అందుకున్నారు. ఇది జరిగిన ఒక్క రోజుకే విజయవాడ పోలీస్ కమిషనర్గా కాంతిరాణా టాటాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు పోలీసు అధికారుల్లోనూ అలజడి రేపాయి. ప్రభుత్వ పెద్దలకు ఎంతో సన్నిహితుడైన డీఐజీ పాలరాజును విజయవాడ నుంచి కదిలిస్తారని ఎవరూ అనుకోలేదు. బహుశా పాలరాజు కూడా అనుకుని ఉండరు. ఆయనకు రాత్రికి రాత్రి చలనం కలిగింది. కాంతి రాణా టాటా కూడా డీఐజీ హోదానే. అయినప్పటికీ పాలరాజును కాదని కాంతిరాణా టాటాను నియమించారు. నిజానికి ఇలా నియమించే ఉద్దేశం ఉంటే ప్రస్తుత సీపీ రిటైర్మెంట్ కంటే ఒకటి, రెండు రోజుల ముందే నియామకం ఖరారు చేసి ఉండేవారు.
పాలరాజు నియామకంపై బలమైన కారణాలు ఉంటే తప్ప ప్రభుత్వం వెనక్కి తగ్గదన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ కారణాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. ఏపీలో ఓ వర్గం అధికారులకే ఉన్నత పదవులు దక్కుతున్నాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్తున్నాయని ఈ క్రమంలో అక్కడ్నుంచి ఏమైనా సూచనలు వచ్చి ఉంటాయా అని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.