పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్ పోస్టులు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే వీరిని సస్పెండ్ చేయడంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కోపం వచ్చింది. సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా వాళ్లనూ వీళ్లనూ కాదు..తనను సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. ఆయన మాటలు విన్న వారికి అది నిజమే కదా… అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు కదా ఎందుకు చేయడం లేదు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ కాదు.. ఎమ్మెల్యే కాదు..కనీసం ఎమ్మెల్సీ కూడా కాదు. ఆయనను సప్పెండ్ చేస్తే.. ఏదో నష్టపోతామని భావించే పరిస్థితి కూడా లేదు. అయినా పొంగులేటిని సస్పెండ్ చేయడం లేదు. ఆయనకు అసలు సభ్యత్వమే లేదని ప్రచారం చేస్తున్నారు. కానీ గత నెల వరకూ పొంగులేటి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైకమాండ్ పెద్దలు పిలిపంంచుకుని మాట్లాడారు కూడా. అప్పుడు ఉన్న సభ్యత్వం ఇప్పుడు ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన అనుచరులపై కాదని..తనను సస్పెండ్ చేాయలంటున్నారు.
పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బయటకు వెళ్లిపోవాలనుకుంటున్న పొంగులేటి ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్టీపీలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఓ వైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్ బంపర్ ఆఫర్లు ఇస్తూంటే ఆయన మాత్రం వైఎస్ఆర్టీపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.