తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్న పరిస్థితి. సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన భాజపాలో చేరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకుంటారు! పొంగులేటితోపాటు కొంతమంది అనుచరులు కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పినవారిలో ఉన్నారు.
పొంగులేటిని కాంగ్రెస్ నుంచి పార్టీలోకి తీసుకుని రావడంలో భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ఆయన ఈ మధ్య తరచూ పొంగులేటికి టచ్ లో ఉన్నారనీ, భాజపాలోకి రావాల్సిందిగా చర్చించి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్సీగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా… చాన్నాళ్లుగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉంటున్న పొంగులేటి రాజీనామా చేయడం ఆ పార్టీకి కచ్చితంగా గట్టి దెబ్బే అవుతుంది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీ అయిన పొంగులేటి… మూడోసారి కూడా పదవి కావాలంటూ ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చెయ్యలేదు. ఆ తరువాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ప్రయత్నించి, చాలామంది కీలక నేతల్ని పొంగులేటి కలిశారు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతోపాటు, రాష్ట్ర నేతల నుంచి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఆయనకి వద్దనే విధంగానే సంకేతాలు వెళ్లినట్టు చెబుతారు! దీంతో పొంగులేటి గత కొంతకాలంగా ఆవేదనతో ఉన్నట్టు సమాచారం.
ఇదే సమయంలో రామ్ మాధవ్ సంప్రదింపులు జరపడంతో, పొంగులేటి కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేశారు. తెలంగాణలో తమకంటూ ఒక బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడం కోసం… ఇక్కడి పరిస్థితులను భాజపా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, రాష్ట్ర నాయకత్వం పట్ల ఉన్న నేతల్లోనే తీవ్ర అసంతృప్తులు ఉండటం… ఇవన్నీ తమకు అనుకూలంగా మార్చుకుని, పేరున్న నాయకుల్ని ఒక్కొక్కరుగా భాజపా ఆకర్షిస్తోంది. ఈ తీరుపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.