ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు! 2019 ఎన్నికల నాటికి పార్టీలో తమ ప్రాధాన్యతను పెంచుకునే పనిలోపడ్డారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే ధీమాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. తానూ సీఎం అభ్యర్థినే అని చెప్పుకునేందుకు కావాల్సిన సందర్భాన్ని జానారెడ్డి కూడా క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నట్టే! ఇటీవలే ఢిల్లీకి వెళ్లొచ్చిన టి. కాంగ్రెస్ పెద్దలు.. అధినేత్రి సోనియా ముందు మనసులో మాటలు చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. ఒకరి పనితీరుపై మరొకరు ఫిర్యాదులు చేసుకుని వచ్చారని కథనాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఇదే క్రమంలో పొన్నాల లక్ష్మయ్య కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారట! పార్టీకి గతంలో చాలా చేశాననీ, కానీ పార్టీ తనకేం చేసిందో ఆలోచించాలని మాట్లాడుతున్నారట!
తెలంగాణలో తొలి పీసీసీ అధ్యక్షుడుగా అప్పట్లో పొన్నాలను అధిష్ఠానం నియమించింది. పొన్నాలకు పీసీసీ అప్పగించడం ఏంటని అప్పట్లో పెద్ద చర్చే నడించింది. సరే, ఆ తరువాత.. ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ ఓటమి పాలైంది. పొన్నాల లక్ష్మయ్య కూడా ఓడిపోయారు. దాంతో ఆ వెంటనే ఆయన్ను హై కమాండ్ కూడా పక్కన పెట్టేసింది. పదవి పోతే పోయిందిగానీ.. ఆ తరువాతైనా తనకు తగిన గుర్తింపు ఉండాలి కదా అంటూ ఇప్పుడు వాపోతున్నారట! ఇన్నాళ్లుగా గుర్తింపు కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయిందనీ, అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోందని ఆయన అంటున్నారట. ఒక బీసీ నాయకుడికి పార్టీ ఇస్తున్న మర్యాద ఇదేనా అంటూ ఆవేదన చెందుతున్నారట. గతంలో డీయస్ ను కూడా ఇలానే పీసీసీ పీఠం నుంచి తప్పించారనీ, ఆ తరువాత డీయస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని.. కానీ, తన విషయంలో మాత్రం ఇలా ఎందుకు జరగలేదని సన్నిహితులతో వాపోతున్నట్టు సమాచారం.
ఇంతకీ, ఇప్పుడు పొన్నాల డిమాండ్ ఏంటంటే… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనైనా తనకు స్థానం కల్పించాలనేది! కాంగ్రెస్ లో ఇప్పటికే కులాలవారీగా కొంతమంది కీలక పదవులు ఉన్నాయనీ, బీసీల పరిస్థితి ఏంటనేది పొన్నాల వారి ప్రశ్న! బీసీ నాయకుడు ఎక్కడున్నాడంటూ పార్టీ నేతలతో వాపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే తనకు ఏదో ఒక పదవి కావాలనేది ఆయన ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. ఉన్నట్టుండి పొన్నాల ఇలా ఎందుకు పట్టుబడుతున్నానేది అర్థమౌతూనే ఉంది కదా! ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇలా కొంతమంది పార్టీపై పట్టు కోసం పాకులాడుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసులో తానూ ఉండాలంటే… ఏదో ఒక పదవి ఉండాలి కదా. సో.. దాని కోసమే ఇప్పుడు పొన్నాల పోరు మొదలుపెట్టారని విశ్లేషకుల అభిప్రాయం.
పార్టీ కోసం పాటుపడే నాయకుల్ని చూశాం. పార్టీని గెలిపించాక పదవుల కోసం పాకులాడే నేతల్ని చూశాం. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా డిఫరెంట్! వారికి ముందుగా పదవులే ముఖ్యం. ఆ తరువాతే పార్టీ అన్నట్టుగా వీరి వైఖరి ఉండటం విచిత్రమే!