రెండేళ్ల క్రితం వరకూ తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ ఆస్వాదించింది పూజా హెగ్డే. ఏ క్రేజీ సినిమా చూసినా.. కథానాయికగా ఆమె పేరే. యువ హీరోలతో పాటు, అగ్ర కథానాయకులతోనూ జోడీ కట్టింది. అయితే సడన్గా… పూజా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అవకాశాలు చేజారిపోయాయి. ఫ్లాపులు వరుసకట్టాయి. చేస్తున్న సినిమాల్లోంచి కూడా డ్రాప్ అయ్యింది. ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి సడన్ గా తప్పుకొంది. కొంతకాలం పూజా పేరు కనిపించలేదు. వినిపించలేదు. తెలుగులో ఆమెకు ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఎట్టకేలకు ఓ ఆఫర్ అందుకొంది పూజా. త్వరలోనే ఆమె నాగచైతన్యతో కలిసి నటించబోతున్నట్టు టాక్.
విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే దాదాపుగా ఖాయమైందని టాక్. చైతూతో పూజాకు ఇది రెండో సినిమా. ఇది వరకు ‘ఒక లైలా కోసం’ సినిమా కోసం జట్టు కట్టారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఆ తరవాత.. ఇద్దరూ కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి జట్టు కట్టబోతున్నారు. చైతూ ప్రస్తుతం ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యిన తరవాతే.. కార్తీక్ దండు ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.