ప్రస్తుతం వరంగల్ జిల్లాలో వైయస్ షర్మిల పరామర్శ యాత్ర సాగుతోంది. ఆమె యాత్రకు మద్దతుగా జిల్లాలో కార్యకర్తలందరూ తరలి రావాలని జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వరులు కోరినప్పటికీ కొద్దిమంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె యాత్రని తెలంగాణా మీడియా ఎలాగూ పట్టించుకోవడం లేదు కనీసం సాక్షి మీడియా కూడా గట్టిగా కవరేజ్ ఇవ్వకపోవడం విచిత్రంగా ఉంది. అదేవిధంగా ఆమె పర్యటిస్తున్న గ్రామాలలో కూడా ఇదివరకులా జనాలు ఆమెతో కలిసి నడవటానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ప్రజలపై తెరాస ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కనుక వారు ఆమెకు దూరం జరిగి ఉండవచ్చును. కానీ స్వంత పార్టీ కార్యకర్తలు, స్వంత మీడియా కూడా ఆమె పర్యటనను పట్టించుకోకపోవడమే విచిత్రంగా ఉంది. తెలంగాణాలో వైకాపాని బలపరుచుకోవాలని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు లేదు. మూడు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు మద్దతు జగన్ మద్దతు పలకడంతో తెరాస పట్ల తమ పార్టీ వైఖరి ఏమిటనే అనుమానం వైకాపా శ్రేణులకి కలిగి ఉంటే ఆశ్చర్యం లేదు. అటువంటప్పుడు ఆ పార్టీ కోసం పనిచేసినా ప్రయోజనం ఉండదనే భావనతోనే పార్టీ కార్యకర్తలు ఆమె పర్యటనకి దూరంగా ఉండి ఉండవచ్చును.
ఈ పరిస్థితిని చూసి జగన్ స్వంత మీడియా కూడా చప్పగా సాగుతున్న ఆమె పరామర్శయాత్రని ఫోకస్ చేసినట్లయితే పార్టీ అప్రదిష్టపాలవుతుందనే ఉద్దేశ్యంతోనే కవరేజ్ చేయడం లేదేమో? కానీ రాజుగారు తలచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు జగన్ తలచుకొంటే జనాలకి కరువుండదు. జనసమీకరణ చేసయినా ఆమె వెనుక పంపించి ఆమె యాత్రకి నభూతో…నభవిష్యత్ అన్నట్లుగా జనాలు నీరాజనాలు పడుతున్నారని చెప్పుకొనే అవకాశం ఉంది. కానీ ఈ సారి ఆ ప్రయత్నమూ చేయడంలేదు ఎందుకో?