పోసాని కృష్ణమురళి… ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి తనంతట తానుగా మీడియా ముందుకొచ్చారు. రెండు ప్రభుత్వాలకు మద్దతుగా తన పరిజ్ఞానాన్ని.. భాషా ప్రయోగాన్ని మొత్తం ఉపయోగించారు. కేసీఆర్, జగన్ సమర్థ నాయకులు అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నారని.. జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ముందుగా తెలంగాణ సర్కార్..కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై… రేవంత్‌ను విమర్శించి.. కేసీఆర్,కేటీఆర్, హరీష్‌రావులను పొగిడేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వారంతా నీతి మంతులని.. వారిపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డినే.. అవినీతిపరుడని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తి రేవంత్‌రెడ్డి అని.. కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే నేనే వ్యతిరేకంగా పోరాడతానని చెప్పుకొచ్చారు. ఎన్జీటీ విచారణకు ఆదేశిస్తే.. కేటీఆర్ రాజీనామాకు సంబంధమేంటని పోసాని ఆశ్చర్యం ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపైనా తన వంతుగా సమర్థింపు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో లింక్ పెట్టి వాదించారు. ఏపీ సర్కార్ విషయంలోనూ.. పోసాని తన పాజిటివ్ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ కోపం ఒక్క నిమిషం మాత్రమేనని ఆయన అన్న మాటలకు ఇండస్ట్రీలో ఎవరూ బాధపడవద్దని సలహా ఇచ్చిన ఆయన.. త్వరలోనే జగన్ ప్రభుత్వం పడిపోతుందన్న..బాలకృష్ణ మాటలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు అధికారంలోకి రావడానికి.. ఏపీలో ఇప్పుడు సీఎం కుర్చీలో ఉన్నది ఎన్టీఆర్ కాదన్నారు. ఎన్నికల సమయంలో..తెలుగుదేశం పార్టీ నేతల్ని వ్యక్తిగతంగా అసభ్యంగా దూషించి…వైసీపీకి మీడియా ద్వారానే కావాల్సినంత ప్రచారం చేసిన పెట్టిన పోసాని..ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.
మధ్యలో ఆయనకు అనారోగ్యం వచ్చిందని చెప్పుకున్నారు.కానీ ఆయనను ఏ వైసీపీ నేతా పట్టించుకోలేదు. చివరికి ఫృధ్వీ విషయంలో ఆయన ఫృధ్వీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడే తనకు పదవి ఇస్తే చేస్తానన్నారు. కానీ వైసీపీ సర్కార్ ఆయనకు ఎలాంటి పదవి ఆఫర్ చేయలేదు. ఆ తర్వాత సైలెంటయిపోయిన పోసాని.. హఠాత్తుగా… తెరమీదకొచ్చేసి.. రెండు ప్రభుత్వాలను.. ఎలా పొగడాలో.. అలా పొగిడారు. మధ్యలో ఆయన ఓ మాట చెప్పారు..ప్రెస్మీట్లు క్రెడిబులిటీ ఉన్న వాళ్లే పెట్టాలని కూడా సలహా ఇచ్చారు.