ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి స్థాన చలనం తప్పేలా లేదు. మరో వారం రోజుల్లోనే ఆయనను డీజీపీ పదవి నుంచి తప్పించి ఇతరులను నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత రాజేంద్రనాథ్ రెడ్డి ఇంచార్జ్ హోదాలోనే ఉన్నారు. నిబంధనల ప్రకారం నియామకం జరగలేదు. అత్యవసరంగా డీజీపీని నియమించుకోవాల్సి ఉంటే… ఇంచార్జ్ గా నియమించుకోవచ్చు. కానీ వెంటనే డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లను డీవోపీటీకి పంపాలి. వారిలో ముగ్గురి పేర్లను ఫైనల్ చేసి .. పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్రం ఎంచుకోవచ్చు. రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపికలో ఈ ఫార్ములాను రాష్ట్రం పాటించలేదు. గౌతం సవాంగ్ ను అప్పటికప్పుడు పంపేసి.. రాజేంద్రనాథ్ రెడ్డికి సీటిచ్చారు.
ఇప్పుడు కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగించాలనుకుంటే… ప్రభుత్వానికి చాన్స్ ఉంది. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవలి కాలంలో ప్రభుత్వం అనుకున్నట్లుగా పనితీరు చూపించలేకపోతున్నారని అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అందుకే.. సీఐడీ చీఫ్ గా .. మూడున్నరేళ్ల పాటు తమను మెప్పించేలా పని చేసిన సునీల్ కుమార్ ను డీజీపీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనకు ఇటీవల డీజీ హోదా ఇచ్చారని చెబుతున్నారు. ఆయనతో పాటు పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా డీజీపీ పోస్టుకు పోటీ పడుతున్నారు. ఇంటలిజెన్స్ మొత్తం రాజకీయం కోసం వాడుతూ ఆయన ప్రభుత్వ పెద్దలకు ఇటీవల బాగా దగ్గరయ్యారని చెబుతున్నారు.
ఏపీ పోలీసు వ్యవస్థ పై ఏపీ ప్రజలు దాదాపుగా నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. సిన్సియర్ అధికారులందరూ లూప్ లైన్ లో ఉన్నారు. రాజకీయకక్ష సాధింపుల కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో.. ఇంకా ఏం కావాలని డీజీపీలను ప్రభుత్వం పదే పదే మారుస్తుందో కానీ.. ఈ వ్యవహారం మాత్రం అధికారుల్లోనూ నిర్వేదానికి కారణం అవుతోంది.