సుప్రీంకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అక్కడ రిటైర్ కాగానే ఇక్కడ ఏపీలో గవర్నర్ గా పదవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్క సారిగా న్యామయూర్తులు.. వారి తీర్పులు.. అనంతరం వారికి లభిస్తున్న పదవులు అంశంపై జోరుగా చర్చ ప్రారంభమయింది. రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తీర్పులన్నీ ఒక్క సారిగా ప్రచారంలోకి వచ్చాయి. గతంలో ఇతర న్యాయమూర్తులు పొందిన పదవులు.. వారిచ్చిన తీర్పులైనా చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. కేవలం మాజీ న్యాయమూర్తులు పదవుల కోసం కక్కుర్తి పడటం వల్లనే. ఇదంతా న్యాయవ్యవస్థకు మంచి చేస్తుందా ? విశ్వసనీయతను దెబ్బ తీస్తుందా ?
వరుసగా రిటైరైన న్యాయమూర్తులకు పదవులు ఇస్తున్న బీజేపీ !
2014లో సుప్రీంకోర్టు సీజేఐగా పని చేసిన జస్టిస్ సదాశివంను కేరళ గవర్నర్ గా నియమించింది నరేంద్రమోదీ ప్రభుత్వం. అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రోజులు. అందుకే చాలా మంది స్వేచ్చగా తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే ఈ అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సీజేఐగా పని చేసి తాను గవర్నర్ కావడం అంటే… పరువు తక్కువ అని.. జస్టిస్ సదాశివం కూడా అనుకోలేదు. ఆయన కూడా పదవి తీసుకున్నారు. అప్పట్నుంచి ప్రారంభమయింది. ఆ తర్వాత పదవులు ఇవ్వడం ఎక్కువైంది. సీజేఐగా పని చేసిన రంజగన్ గోగోయ్ … రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయన ఆ పదవిని యాక్సెప్ట్ చేసినప్పుడు జరిగిన రచ్చ.. చర్చ అంతా ఇంతా కాదు. అప్పుడు అబ్దుల్ నజీర్ విషయంలోనూ అంతే.
పదవులు చేపట్టడం తప్పు కాదు.. కాని వారిచ్చిన తీర్పుపై సందేహాలు ప్రారంభం కావా ?
న్యాయమూర్తులు రిటైరైన తర్వాత పదవులు చేపట్ట కూడదా అని కొంత మంది ప్రశ్నిస్తారు. పదవులు చేపట్టడం నిబంధనలకు ఏ మాత్రం విరుద్ధం కాదు. వారికి ఆ స్వేచ్చ ఉంది. కానీ ఈ పదవుల కోసం వారు తమ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పక్షపాతంగా తీర్పులు చెప్పలేదని గ్యారంటీ ఏమిటి ?. ఏమీ ఉండదు.. అందుకే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పదవులు పొందిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. వాటిలో విశ్వసనీయతను ప్రశ్నించడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితికి అవకాశం కల్పించింది.. పదవులు చేపట్టిన మాజీ న్యాయమూర్తులే.
మాజీ న్యాయమూర్తులు విలువను పాటించాలి !
దేశంలో ఇంకా విశ్వసనీయతను కాపాడుకుంటున్న వ్యవస్థ ఏదైనా ఉంటే అది న్యాయవ్యవస్థ మాత్రమే. దాన్ని కాపాడుకోవాల్సింది… ఆ వ్యవస్థలో భాగమైన వారే. లేకపోతే ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి కొంత మంది న్యాయమూర్తులే కారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అత్యున్నత స్థాయిలో పని చేసిన తర్వాత వారికి ఎలాంటి పదవులైనా చిన్నవే. ఎలాంటి పదవి చేపట్టినా వారిచ్చిన తీర్పులపై చర్చలు మొదలవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సింది రిటైరైన న్యామయూర్తులే.
ఇలా కొంత మంది పదవులు చేపట్టడం ద్వారా.. కొత్తగా వ్యవస్థలోకి వస్తున్న వారికి ఏం సందేశం ఇస్తున్నారో కానీ.. మొత్తంగా… ఇది ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం మాత్రం అంతటా ఉంది.