సీఎంగా జగన్ ప్రమాణస్వీకార వేదికపై బిగ్గరగా చేసిన అరుపులు పదే పదే ప్రజలకు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తాను విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తాను అని కేసీఆర్, స్టాలిన్ సమక్షంలో జగన్ బిగ్గరగా చేసిన ప్రకటన విని జనం మాట తప్పడు.. మడమ తిప్పడు అనుకున్నారు. నాలుగేళ్లు గడిచింది. కరెంట్ చార్జీలు పైసా తగ్గకపోగా ఏడు సార్లు పెంచారు.. ఇప్పుడు ట్రూ అప్ పేరుతో ప్రతీ నెలా బాదేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీఈఆర్సీ నుంచి అనుమతి తెచ్చుకున్నారు.
ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రతీ నెలా ఒక్కో యూనిట్ కు నలభై పైసలు వడ్డించేందుకు అనుమతి లభించింది. ఇది సామాన్య ప్రజలకు అత్యంత భారంగా మారనుంది. ఈ ట్రూ అప్ చార్జీలు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడం వల్ల పడిన భారానికి వసూలు చేసే చార్జీలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి వాటి దగ్గర్నుంచి కరెంట్ కొనడం మానేయడమే కాకుండా… ఒప్పందాల ప్రకారం వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.. అవసరాల కోసం కరెంట్ ను బయట నుంచి యూనిట్ కు రూ. ఇరవై కూడా పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు వాటినే ప్రజల వద్ద నుంచి పిండేస్తున్నారు.
ఏ మాత్రం ముందు చూపు లేకుండా… ఎవర్నీ పట్టించుకోకుండా .. చేసే పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఉన్నాయి. అత్యంత దరిద్రమైన రోడ్లు కూడా ఏపీలోనే ఉన్నాయి. అతి ఎక్కువ కరెంంట్ చార్జీలు కూడా ఇక ఏపీలోనే ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే ఐదు, పది వేలు కొంత మందికి వస్తూంటే… అందు కోసం ప్రతి ఒక్కరూ పన్నుల భారం మోయాల్సి వస్తోంది.