హైదరాబాద్: హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బాధ కలుగుతోందని అనంతపురంజిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే, జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు. హైదరాబాద్‌వంటి రాజధాని ఏపీకి వస్తుందో, లేదో తనకు నమ్మకం లేదని చెప్పారు. అనంతపురంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీవల్ల తాము బాగుపడ్డామని అంగీకరించారు. రాష్ట్ర విభజనవల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సివచ్చిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలన్నీ వృథాగానే ఉన్నాయని విమర్శించారు. తన నియోజకవర్గం తాడిపత్రి అభివృద్ధికోసం అవసరమైతే దౌర్జన్యానికి దిగుతానని చెప్పారు. సీమలోని కరువుప్రాంతాలకు తాగు, సాగునీరు ఇస్తే చంద్రబాబు మళ్ళీ సీఎమ్ అవుతారని అన్నారు. రాహుల్ అనంతపురం పర్యటన అవసరంలేదని, కాంగ్రెస్ హయాంలో అత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు సాయం చేస్తే మంచిదని చెప్పారు.
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జేసీ ప్రభాకరరెడ్డి ఇవాళ హైదరాబాద్గురించి చేసిన వ్యాఖ్యలుమాత్రం సీమాంధ్రప్రాంత ప్రజలందరి మనసుల్లో ఇప్పుడు గూడుకట్టుకున్న మనోభావాలేనని అంగీకరించాలి. హైదరాబాద్ అభివృద్ధిలో తమకూ భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు అది తమకు కాకుండా పోయిందనేది వారి భావన.