బాహుబలితో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్‌కి తెలిసిపోయింది. టాలీవుడ్లో ఇలాంటి హీరో ఒకడున్నాడని, తనతో సినిమా తీస్తే.. వందల కోట్లు వచ్చిపడిపోతాయని హిందీ జనాలకు రీసెంట్ గానే అర్థమైంది. దాంతో బాహుబలి క్రేజ్ వాడుకోవాలని తహతహలాడిపోతున్నారు. కరణ్ జోహార్ అయితే మరీనూ. బాహుబలి హిందీ వెర్షన్‌కి ఆయనే నిర్మాత. బాహుబలి ఫలాల్ని అనుభవించినవారిలో కరణ్ కూడా ఉన్నాడు. బాహుబలి తరవాత ఇంకొంత కాలం ఆ ఎఫెక్ట్ ఉంటుందని, ఈలోగా వీలైనంత సొమ్ము చేసుకొందామని గట్టిగా నమ్ముతున్నాడాయన. అందుకే ప్రభాస్‌ని తన వల్లోవేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలూ హిందీలో తెగ ఆడేశాయి. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఇది వరకే ఓ పెద్ద పార్టీ ఇచ్చాడు కరణ్ జోహార్. ఆ విందుకు ప్రభాస్ హాజరవలేదు. అయితే.. ఇటీవల ప్రభాస్ కోసం మళ్లీ ఓ పార్టీ ఏర్పాటు చేశాడు కరణ్. ఈ పార్టీలో కరణ్ జోహార్ బ్యాచ్ మొత్తం పాలు పంచుకొంది.
ఇదే అదునుగా.. ప్రభాస్ కోసం రెండు ప్రాజెక్టులు సెట్ చేసి పెట్టాడట కరణ్. కథ, నిర్మాత, దర్శకుడు.. ఈ మూడింటినీ రెడీ చేసి, ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడట. ప్రభాస్ తో ఈ రెండు ప్రాజెక్టుల కోసం కరణ్ చర్చించాడని, అయితే ప్రభాస్ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఒకేసారి పారితోషికం సెటిల్ చేస్తానని, కావల్సిన టెక్నిషియన్లను సెట్ చేస్తానని కరణ్ మాట ఇచ్చాడని, అయినా సరే.. ప్రభాస్ పడిపోలేదని తెలుస్తోంది. ”తెలుగులో సినిమా చేసి, దాన్ని హిందీలో డబ్ చేద్దాం.. అంతేగానీ.. బాలీవుడ్లో నేరుగా సినిమా చేయలేను” అని సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట ప్రభాస్. కానీ.. కరణ్ మాత్రం ప్రభాస్‌తో హిందీ సినిమా చేయించాలన్న పట్టుదలతో ఉన్నాడని, అందుకోసం తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడని తెలుస్తోంది.