రాజుల లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆ సరదాలు, విలాసాలూ… వేరే లెవల్. అతీథ్యంలోనూ అంతే! ఎన్ని సినిమాల్లో చూడలేదూ..? ప్రభాస్ అంటే కచ్చితంగా గుర్తొచ్చేవి ఇవే. ప్రభాస్ లైఫ్ స్టైల్ గురించి ఇండస్ట్రీలో రకరకాల గాసిప్పులు తిరుగుతుంటాయి. టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోల్లో ప్రభాస్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. దానికి తగ్గట్టు ఖర్చు కూడా. ప్రభాస్ వెనుక మందీ మార్బలానికి లెక్కలేదు. ఎక్కడకు వెళ్లినా, అటూ ఇటుగా కనీసం ముఫ్ఫైమంది ప్రభాస్ తోడుంటారు. వాళ్లందరి ఖర్చూ ప్రభాస్ పైనే. ప్రభాస్‌కు ఏ లగ్జరీలు దొరుకుతాయో.. మిగిలినవాళ్లకూ అవి దొరకాల్సిందే. ఆఖరికి ప్రభాస్ విహారం కోసం విదేశాలకు వెళ్లినా, వెంట 20 – 30 మంది ఉండాల్సిందే. ఒక్కో ట్రిప్పుకూ కోట్ల రూపాయలు ఎగిరిపోతుంటాయి. ఇక సెట్లో ప్రభాస్ చూపించే అతిథి మర్యాదలకు లెక్కే లేదు. ఓ బఫేలో ఎన్ని ఐటెమ్స్ ఉంటాయో.. ప్రభాస్ సెట్లో అన్నీ ఉంటాయి. అందరూ అన్నీ తినాల్సిందే. ప్రభాస్ పెట్టే తిండి ఖర్చే ఒక్కో సినిమాకీ అటూ ఇటుగా కోటి రూపాయల లెక్క తేలుతుంది. ఇక సినిమా అయిపోయిన తరవాత టీమ్ అందరికీ ప్రభాస్ గిఫ్టులు పంపుతుంటాడు. ఇదంతా ప్రభాస్ చూపించే ప్రేమ. దానికి తోడు చేతిలో యూవీ క్రియేషన్స్ ఉంది. ఆ సంస్థకు తనే మూల స్థంభం. లాభ నష్టాల్లో తన వాటా ఎక్కువ.
Also Read : ప్రభాస్ @ రూ.200 కోట్లు!
ఇదంతా చూసి ఎవరైనా పొంగిపోవాల్సిందే. అదే సమయంలో ప్రభాస్ దుబారా ఎక్కువ చేస్తున్నాడని బాధపడేవాళ్లూ ఉన్నారు. నిన్నా మొన్నటి వరకూ ప్రభాస్ ఇలానే వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ మారిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ ఆతిథ్యం, ప్రేమ, స్నేహం పేరుతో ఎంత ఖర్చు పెట్టినా, కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ బాలెన్స్ పాటిస్తున్నాడని చెబుతున్నారు. ఈమధ్య ప్రభాస్ తన పెట్టుబడిని రియల్ ఎస్టేట్ వైపు మళ్లిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఇటలీలో ఓ ఖరీదైన బంగ్లా కొన్నాడట ప్రభాస్. ముంబైలోనూ కొన్ని ఫ్లాటులు కొనుగోలు చేశాడని టాక్. హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడు. అది కూడా చాలా విలాసవంతంగా తీర్చిదిద్దుతున్నాడని తెలుస్తోంది. కొత్త సినిమా ఏదైనా ఒప్పుకొంటే, ఆ అడ్వాన్సుల్ని పెట్టుబడివైపు మళ్లిస్తున్నాడని చెప్పుకొంటున్నారు. నిజానికి ఇది చాలా తెలివైన పని. భవనాలు, స్థలాలపై ఎంత పెట్టుబడి పెట్టినా నష్టం లేదు. ఎందుకంటే.. వాటి విలువ పెరుగుతూనే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. భారీ సినిమాలు తీసి, చేతులు కాల్చుకోకూడదన్న నిర్ణయానికి ప్రభాస్ వచ్చేశాడు. అందుకే యూవీ ఇప్పుడు చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. కృష్ణంరాజు బాగా సంపాదించారు. అంతే బాగా ఖర్చు పెట్టేవారు. అయినా ఆర్ధిక క్రమశిక్షణ ఉండేది. ప్రభాస్ ఇప్పుడు దాన్ని అలవాటు చేసుకొంటున్నాడు. ఇది ప్రభాస్‌లో అభిమానులు ఆశించిన మార్పే!