నిజమైన పాన్ వరల్డ్ స్టార్ అంటే ప్రభాస్ పేరే చెప్పుకోవాలి. బాహుబలి, సలార్. కల్కి.. ఇలా భారీ విజయాలతో తనకు తిరుగులేదనిపించుకొన్నాడు. రూ.1000 కోట్ల హీరోగా ప్రభాస్ కు అరుదైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ప్రభాస్ పారితోషికం రూ.200 కోట్లకు చేరుకొందని సినీ విశ్లేషకులు లెక్కగడుతున్నారు. ప్రభాస్ ‘ఓకే’ అనాలే కానీ, అంతకంటే ఎక్కువ ఇచ్చి డేట్లు లాక్ చేసుకోవడానికి సైతం నిర్మాతలు రెడీనే. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకొన్నాడు. ‘రాజాసాబ్’ కోసం.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన పారితోషికాన్ని తగ్గించుకొన్నాడన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ముందస్తు ఎగ్రిమెంట్ కన్నా, ప్రభాస్ తక్కువకే ఈ సినిమా పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది. దానికీ ఓ కారణం ఉంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తెలుగు హక్కుల్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకొంది. అప్పట్లో ఆ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఫ్యాన్సీ రేటుకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కొనేసింది. పైగా ప్రభాస్ సైతం ఈ డీల్ లో కీలక పాత్ర పోషించాడు. ‘మీరు ఈ సినిమా కొనండి. మీ వెనుక నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చాడు. అప్పటికే ‘రాజాసాబ్’ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేయడానికి ప్రభాస్ ఒప్పుకొన్నాడు. ఓరకంగా తమ సంస్థ హీరో అయిపోయాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ మాటపై గౌరవంతో కాస్త రేటు ఎక్కువే అయినా పీపుల్ మీడియా ఆ సినిమా సొంతం చేసుకొంది. అయితే ‘రాధేశ్యామ్’ నష్టాల బాట పట్టింది. ఈ సినిమాతో పీపుల్ మీడియా కాస్త ఎక్కువగానే డబ్బులు పోగొట్టుకొంది. పరిహారంగా ప్రభాస్ ఇప్పుడు తన పారితోషికంలో కోత విధించుకొన్నాడని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ యూవీ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం. యూవీ అంటే ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ. ‘రాధే శ్యామ్’ చిత్రీకరణ సమయంలో యూవీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈ డీల్ ని ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకు తీసుకెళ్లాడు. చెప్పిన మాట ప్రకారం… ఇప్పుడు ఆ నష్టాల్లో తన వంతు భాగం పంచుకొంటున్నాడు.