ప్రభాస్, శర్వానంద్ మంచి మిత్రులు. ప్రభాస్ సొంత సంస్థతో సమానమైన యువీ క్రియేషన్స్ తెరకెక్కించిన రన్ రాజా రన్ శర్వా కెరీర్‌నే మార్చేసింది. ఆ సినిమాతోనే కమర్షియల్ హీరో అయిపోయాడు. ఆ విధంగా శర్వా – ప్రభాస్‌ల బంధం మరింత బలపడింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు సినిమానీ యూవీ క్రియేషన్సే నిర్మించింది. ఆ విధంగా ప్రభాస్ బ్యానర్లో శర్వా మరో సినిమా చేసినట్టైంది. మహానుభావుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ప్రభాస్ వచ్చి… తన విషెష్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో రన్ రాజా రన్ గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలీని ఓ విషయం బయట పెట్టాడు.
రన్ రాజా రన్ కథకి తగిన కథానాయకుడ్ని వెదుకుతున్న తరుణంలో శర్వానంద్ పేరు చర్చకు వచ్చిందట. ఆ సమయంలో శర్వా అన్ని సీరియెస్ కథలే చేస్తున్నాడు. రన్ రాజా రన్లో హిలేరియస్ కామెడీ పండించాలి. ఈ పాత్రకు శర్వా సరిపోతాడా, లేదా? అనే అనుమానం టీమ్ కి వచ్చిందట. ”ట్రై చేసి చూద్దాం.. సరిపోలేదనుకొంటే.. పక్కన పెట్టి, మరో హీరోతో చేద్దాం” అనుకొన్నార్ట. ఈ విషయం తెలిసి కూడా.. ఈ సినిమాలో నటించడానికి శర్వా ముందుకొచ్చాడట. అప్పుడే శర్వానంద్ ఆటిట్యూడ్ తనకు బాగా అర్థమైందని, ఆ సినిమాతో శర్వా అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఈ సందర్భంగా శర్వాని కాబోయే సూపర్ స్టార్ అని అభివర్ణించడం విశేషం. ”శర్వా మా ఇంటి హీరో.. కాబోయే సూపర్ స్టార్” అంటూ శర్వాని పొగడ్తలతో ముంచేశాడు. శర్వానంద్ కూడా ఏం తీసిపోలేదు. ”నేను ఈ సినిమా వరకే మహాను భావుడ్ని. ప్రభాస్ నిజ జీవితంలోనూ మహానుభావుడే” అన్నాడు. ”ఎదుటివాళ్ల మంచి కోరుకొనే వ్యక్తి ప్రభాస్ అన్న. మనకు నలుగురైదుగురు స్నేహితులుంటారు. ప్రభాస్ అన్నకి మాత్రం పాతిక మంది ఉంటారు. నా సినిమా వస్తోందంటే నా కంటే ఎక్కువ టెన్షన్ పడతాడు. తనకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు” అన్నాడు శర్వా.