‘బాహుబలి’ తరవాత ప్రభాస్ సినిమా అంటేనే సహజంగానే… అందరి దృష్టీ అటువైపు పడుతుంది. ఆ సినిమా మొదలవ్వకముందే బిజినెస్ పూర్తయిపోతుంది. దర్శకుడెవరైనా నిర్మాతలకు కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది. ప్రభాస్ సినిమా అనే ట్యాగ్ లైన్ చాలు. మరే హడావుడీ అవసరం లేదు. కానీ.. `సాహో` టీమ్ వేరేలా ఆలోచిస్తోంది. ‘బిగ్గర్ దెన్ బాహుబలి’ అనే ఇమేజ్ ఈ సినిమాకి తీసుకొచ్చే పనిలో తలమునకలై ఉంది. అందుకే… బాలీవుడ్ కథానాయికని, అక్కడి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ వాడుకుంటూ ఈ సినిమాని బాలీవుడ్ స్థాయిలో ప్రచారం కల్పించడానికి సిద్ధమైంది. అక్కడితో ఆగిపోలేదు… సినిమా బడ్జెట్ ఎంతన్నది ముందే ప్రకటించి మరింత హైప్ క్రియేట్ చేసేలా చేసింది. అంతేనా?? కేవలం యాక్షన్ సన్నివేశాలకే రూ.90 కోట్లు ఖర్చు పెట్టామని ఘనంగా చెప్పుకుంది. యాక్షన్‌కే రూ.90 కోట్లంటే… మరి సినిమాకి ఇంకెంత అయ్యుంటుంది..? రోబో 2.0 ని పక్కన పెడితే.. సౌతిండియాలో ‘సాహో’నే ఖరీదైన సినిమా అన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా విడుదలయ్యే సరికి బడ్జెట్ ఎంతకి తేలుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
బాహుబలి తరవాత ప్రభాస్ సినిమా అంటే… ఎంతైనా పలుకుతుంది. కాబట్టి నిర్మాతలు ఖర్చు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ సినిమా గురించి ఇంత హైప్ సృష్టించుకోవడం ఎందుకు? అనేదే అర్థం కావడం లేదు. బాహుబలి రేట్లకు ‘సాహో’ని ఎవ్వరూ కొనరు. ఆ సంగతి యూవీ క్రియేషన్స్‌కి కూడా తెలుసు. అలాంటప్పుడు `బిగ్గర్ దెన్ బాహుబలి` అనే ట్యాగ్‌లైన్ ఎందుకు ఉపయోగపడుతుంది? సినిమా చూసి `దీనికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారో` అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలి. అంతే గానీ..’ఈ ఫైట్‌కి ఇంత ఖర్చు పెట్టాం’ అని ముందే చెప్పేస్తే… ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ ఖర్చే కళ్లముందు కనిపిస్తుంది. ఇప్పటికి ఈ సినిమాపై వచ్చిన హైప్ చాలు. అది అలా పెరుగుతూ పోతే.. సినిమాకే నష్టం. ‘మగధీర’ తరవాత రామ్‌చరణ్ ఇమేజ్ కూడ ఇలానే కనిపించింది. అందులోంచి బయట పడడానికి చరణ్‌కి చాలా ఏళ్లు పట్టింది. ‘సింహాద్రి’ తరవాత… ఎన్టీఆర్ పరిస్థితీ ఇంతే. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ హిట్లు కొట్టిన హీరోలు.. ఆ తరవాత ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికీ, ఆ స్థాయి విజయాల్ని అందుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విషయం ‘ఛత్రపతి’ చేసిన ప్రభాస్‌కీ తెలుసు. కానీ ఈ సూత్రాలు, పాఠాలూ ‘సాహో’ విషయంలో పాటించడం లేదేమో అన్న అనుమానం కలుగుతోంది.