‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని మాటలతో నిలదీసిన నటుడు ప్రకాష్‌రాజ్. సూటిగా ప్రశ్నలు సంధించడం ఆయన శైలి. తాజాగా మీడియాను నిలదీశారాయన. ముఖ్యంగా టీవీ మీడియాపై ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం తర్వాత వ్యవహరించిన విధానాన్ని తప్పుబట్టారు. తొలుత ఆమె మరణం పట్ల బాధతో స్పందించిన మీడియా, ‘బాత్రూమ్లో పడి మరణించిందట’ అనగానే ఎందుకు యూటర్న్ తీసుకుంది? అని ప్రకాష్‌రాజ్ ప్రశ్నిస్తున్నారు. టీవీలలో డెమోలతో చూపించడాన్ని దుయ్యబట్టారు.
“ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ఘనత శ్రీదేవిది. రియల్ సూపర్ స్టార్ ఆవిడ. అటువంటి మహిళ మరణిస్తే ప్రవర్తించే తీరు ఇదేనా? ఒక వ్యక్తి ఎలా మరణించారనేది ముఖ్యమా? ఎలా జీవించారు అనేది ముఖ్యమా? ఏం ఆలోచించారా? శ్రీదేవి మరణాన్ని చూసిన విధానం మన సంస్కారాన్ని తెలుపుతుంది” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు
శ్రీదేవి మందు తాగారా? లేదా? అంటూ నిర్వహించిన చర్చలపై ప్రకాష్ మండిపడ్డారు. సదరు చర్చలు నిర్వహించిన వారు ఎవరూ మందు తాగారా? ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మందు తాగి మరణిస్తే ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య శ్రీదేవి మండుతున్న అగ్ని మధ్యలో వున్న కర్పూరంలా కనిపిస్తుందని పేర్కొన్నారు.